స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని ప్రోత్సహించండి: మోదీ

దేశ ప్రజలంతా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఇందుకోసం ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని పలి జిల్లాలో నిర్వహించిన జైన ఆచార్యులు విజయ్‌ వల్లభ్‌ సురీశ్వర్‌ 151వ జయంతి కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు.

Published : 16 Nov 2020 17:17 IST

జైపూర్‌: దేశ ప్రజలంతా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఇందుకోసం ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో నిర్వహించిన జైన ఆచార్యులు విజయ్‌ వల్లభ్‌ సురీశ్వర్‌ 151వ జయంతి కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురీశ్వర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన సాధువులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అందరూ స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సాధువులను కోరారు. జైనాచార్య విజయ్‌ వల్లభ్‌ ప్రజలను విద్యావంతుల్ని చేసేందుకు ఎంతో ప్రయత్నాలు చేశారని.. ఆయన అనుకున్న విధానంలోనే ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి చట్టాలు సహా పలు విషయాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని మహిళలు ఆర్మీ వంటి సాయుధ దళాలు సహా పలు రంగాల్లో అవకాశాలు పొందుతున్నారని పేర్కొన్నారు.  ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ ప్రచారాన్ని ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లాలని కోరారు. 

సమాజ మార్పులో మీడియా పాత్ర కీలకం
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు సోమవారం జాతీయ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ప్రెస్‌ దినోత్సవ వర్చువల్‌ కార్యక్రమంలో మోదీ రాతపూర్వక సందేశాన్ని పీసీఐ ఛైర్మన్‌ సీకే ప్రసాద్‌ వినిపించారు. ‘సానుకూల విమర్శలు చేసినా, విజేతల గాథలను ఎత్తిచూపినా మీడియా నిరంతరం భారత ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యమైన విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తోంది. స్వచ్ఛభారత్‌, నీటి సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విలువైన వాటాదారు పాత్ర పోషించింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలోనూ మీడియా ఎంతో గొప్పగా పని చేసింది. కొవిడ్‌ తర్వాత దేశం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాయంతో దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ విషయంలో మీడియా మా సంకల్పానికి ప్రచారం కల్పిస్తూ ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది’ అని మోదీ వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని