
ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ట్రంప్ సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో వీరు పరీక్షలు చేయించుకున్నారు. తాము క్వారంటైన్లోకి వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన సలహాదారు హోప్ హిక్స్ విరామం లేకండా విధుల్లో నిరంతరం నిమగ్నమై ఉండటంతో కొవిడ్-19 వచ్చిందని.. ఇది చాలా విచారకరమని అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నామని.. ఫలితాల్లో పాజిటివ్ అని తేలినట్లు వెల్లడించారు.
కాగా, తాను బాగానే ఉన్నానని.. అధ్యక్షుడిగా తన బాధ్యతలను ఏ అంతరాయం లేకుండా నిర్వహిస్తానని ట్రంప్ వివరించారు. అందరం కలసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన అమెరికన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటున్నట్టు మెలానియా తెలిపారు. అందరూ అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ఆమె కోరారు. ట్రంప్ దంపతుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. వారు శ్వేత సౌధంలో క్వారంటైన్ కాలాన్ని గడపనున్నారని వైద్యుడు సీన్ కాన్లే ప్రకటించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెలరోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఈ పరిస్థితి తలెత్తడం ట్రంప్ విజయావకాశాలపై ప్రభావం చూపగలదని పరిశీలకులు అంటున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తన స్నేహితుడు ట్రంప్, ఆయన సతీమణి త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.