అత్యాచారం చేస్తే నపుంసకం లేదా ఉరిశిక్షే!

పాకిస్థాన్‌లో పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన రెండు నూతన ఆర్డినెన్సులకు పాక్‌ కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

Published : 25 Nov 2020 21:33 IST

ఆర్డినెన్సులకు పాక్‌ కేబినెట్‌ సూత్రప్రాయం ఆమోదం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన రెండు నూతన ఆర్డినెన్సులకు పాక్‌ కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులపై అత్యచారాలు వంటి లైంగిక నేరాలకు పాల్పడే వారికి రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చడం, ఉరి తీసేందుకు వీలు కల్పించే ఈ నూతన ఆర్డినెన్సులకు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. వీటికి సంబంధించి అత్యాచార నిరోధక (దర్యాప్తు, విచారణ) ఆర్డినెన్సు-2020,  పాకిస్థాన్‌ శిక్షాస్మృతి (సవరణ)-2020 ఆర్డినెన్సులకు బుధవారం పాకిస్థాన్‌ మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శిక్షలు, విధివిధానాలను ఖరారు చేసిన అనంతరం, వచ్చే వారం రోజుల్లోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు ప్రకటించింది. సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి కఠినశిక్ష విధించడంతో పాటు అత్యాచార నేరస్థులను ఉరితీసేందుకు వీలు కల్పించేవిధంగా చట్టంలో కఠిన నిబంధనలను రూపొందిస్తునట్లు పాక్‌ ప్రభుత్వం పేర్కొంది.

నూతన ఆర్డినెన్సుల్లో భాగంగా, అత్యాచారం నిర్వచనాన్ని కూడా మార్చుతున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌ చరిత్రలోనే తొలిసారిగా ‘ట్రాన్స్‌జెండర్‌’, ‘సామూహిక అత్యాచారం’ వంటి అంశాలను చేరుస్తూ అత్యాచారానికి నూతన నిర్వచనాన్ని మార్చారు. అంతేకాకుండా అత్యాచారం నిర్ధారణకు ఇప్పటివరకు పాటిస్తున్న పాత పద్ధతులకు కూడా స్వస్తి చెబుతున్నట్లు పేర్కొన్నారు. అత్యాచార కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయడంతో పాటు బాధితులు, వారికి మద్దతుగా నిలిచే వారికి ఈ చట్టం ద్వారా రక్షణ కల్పిస్తామని పాకిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని