కుల్‌భూషణ్‌ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌ భూషన్ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

Published : 30 Jul 2020 23:57 IST

ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వాదనలు వినేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. దీనికి ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అథర్‌ మినల్లా నాయకత్వం వహించనున్నారు. అలానే జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అంతర్జాతీయ న్యాయస్థానాలకు సంబంధించి సవరణలు చేసిన కొత్త బిల్లును ఆమోదం కోసం ఈ వారం పాక్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చేసిన సవరణలు అమల్లోకి వస్తే జాదవ్‌ తన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) సవాలు చేయవచ్చని సమాచారం. జులై 17, 2019న జాదవ్‌ కేసు విచారణ సందర్భంగా ఐసీజే సూచనల మేరకు ఈ చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పాక్‌ కొత్త కుట్రకు తెరలేపింది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించాడని, అందువల్లనే తొలుత దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లడానికి నిర్ణయించినట్లు తెలిపింది. దీని ద్వారా జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపే కుట్ర పన్నుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రణాళిక ప్రకారమే పాక్‌ జాదవ్‌ తనకున్న అవకాశాలను ఉపయోగించుకోకుండా సంబంధిత పత్రాలు ఇవ్వకుండా అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘింస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత్ కోరిక మేరకు రెండో సారి న్యాయవాది ద్వారా జాదవ్‌ను కలిసేందుకు దౌత్యవేత్తలకు అనుమతి లభించింది. మొదట 2019 సెప్టెంబరున భారత ప్రతినిధులు ఆయన్ను కలిసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని