పాక్‌.. అబోట్టాబాద్‌ దాడి గుర్తుపెట్టుకో! 

అంతర్జాతీయ వేదికపై పదే పదే అబద్ధాలను వల్లెవేస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఎంతోమంది ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోన్న పాక్‌ అవాస్తవాల చిట్టాను ఎవరూ విశ్వసించరని పేర్కొంది. దాయాది దేశం

Published : 25 Nov 2020 17:22 IST

దాయాది అబద్దాలకు భారత్‌ దీటైన జవాబు

ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ వేదికపై పదే పదే అబద్ధాలను వల్లెవేస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఎంతోమంది ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోన్న పాక్‌ అవాస్తవాల చిట్టాను ఎవరూ విశ్వసించరని పేర్కొంది. దాయాది దేశం ‘అబోట్టాబాద్‌ దాడి’ని గుర్తుపెట్టుకోవాలంటూ గట్టిగా హెచ్చరించింది. అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్‌ అండతో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ భారత్‌లో చేస్తున్న దురాగతాలను భారత్‌ ఇటీవల కీలక దేశాల రాయబారులకు వివరించింది. ఆ మరుసటి రోజే ఐక్యరాజ్యసమితిలో పాక్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను కలిశారు. భారత్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రాలు సమర్పించారు. ఈ పరిణామాలపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘పాక్‌ అబద్ధాల చిట్టాకు ఎలాంటి విశ్వసనీయత దక్కదు. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఎంతో మంది ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇలాంటి ఊహాజనిత పత్రాలు తీసుకురావడం, తప్పుడు కథనాలు సృష్టించడం కొత్తేమీ కాదు. పాక్‌.. అబోట్టాబాద్‌ను గుర్తుపెట్టుకో!’ అని దాయాది దేశం చర్యలకు తిరుమూర్తి దీటైన జవాబిచ్చారు. 

పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో దాక్కున్న అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను 2011 మే నెలలో అమెరికా ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా చాలా మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు పాక్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికైనా దాయాది దేశం ఉగ్రవాదులుపై తన తీరు మార్చుకోకపోతే మళ్లీ అబోట్టాబాద్‌ లాంటి దాడులు తప్పవంటూ భారత్‌ పరోక్షంగా హెచ్చరించింది. 

జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో ఈ నెల 19న భద్రతా బలగాలు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాల ప్రతినిధులకు గత సోమవారం వివరించారు. భద్రతా బలగాలు హతమార్చిన ఉగ్రవాదులు జైషే ముఠాకు చెందినవారని, వారి వద్ద దొరికిన ఆయుధాలన్నీ పాకిస్థాన్‌ నుంచి వచ్చినవేనని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలను పాక్‌ మానుకోవడం లేదని, ప్రజాస్వామ్య పంథాలో జరుగుతున్న స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని