Pakistan: ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై పాక్‌ విమర్శలు

జమ్మూ-కశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌ అగ్రనాయకత్వం మరోసారి మండిపడింది.

Updated : 06 Aug 2021 14:34 IST

ఇస్లామాబాద్‌: జమ్మూ-కశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌ అగ్రనాయకత్వం మరోసారి మండిపడింది. కశ్మీర్‌ ప్రజలకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అవిభక్త జమ్మూ-కశ్మీర్‌కు రాజ్యాంగంలోని 370వ అధికరణం కింద లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని 2019 ఆగస్టు 5న భారత పార్లమెంటు రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన పాక్‌.. భారత్‌తో సంబంధాల స్థాయిని తగ్గించింది. వాణిజ్య సంబంధాలనూ నిలిపివేసింది. భారత్‌ తీసుకున్న నిర్ణయానికి గురువారంతో రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్, సైన్యాధిపతి జనరల్‌ కామర్‌ జావెద్‌ బజ్వాలు స్పందించారు. భారత అక్రమ చర్యలను నిరసిస్తూ ‘దోపిడీ దినాన్ని’ పాటించినట్లు ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. ఈ రెండేళ్లలో దారుణ అణచివేత చోటుచేసుకుందని తెలిపారు. ఆ ప్రాంతంలో జనాభాపరమైన లెక్కలను మార్చాలని భారత్‌ చూస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు కోసం అన్ని వేదికలపై పాక్‌ తన గొంతుకను వినిపిస్తుందని చెప్పారు. 

సైనిక దిగ్బంధంలో ప్రజలు

కశ్మీర్‌ ప్రజలను సైనిక దిగ్బంధంలో భారత్‌ ఉంచుతోందని బజ్వా ఆరోపించారు. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావంగా నిర్వహించిన ఒక ర్యాలీలో పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ పాల్గొన్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను నాశనం చేయడం ద్వారా భారత్‌.. నిప్పుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయాలను వెనక్కి తీసుకునేవరకూ ఆ దేశంతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. భారత నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌ వ్యాప్తంగా గురువారం నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావంగా సరిగ్గా ఉదయం 9 గంటలకు దేశవ్యాప్తంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో రోడ్లపై ట్రాఫిక్‌నూ నిలిపివేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని