Updated : 28 Aug 2020 16:43 IST

పాయే.. మళ్లీ పాక్‌ పరువు పాయే..!

ఐరాసలో అబద్ధాలతో ఇరకాటం

‘అక్రమ్‌’ను నమ్ముకుంటే ఇంతే..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పాలంటే గుండెలు తీసిన బంటై ఉండాలి.. పాకిస్థాన్‌ అటువంటిదే.. ఐక్యరాజ్యసమితిలో నిస్సిగ్గుగా అసత్యాలు పలికిన ఘనత ఆ దేశానికి ఉంది.. ఈ క్రమంలో అవసరమైతే అక్కడి పాక్‌ ప్రతినిధులు కన్నీరు పెట్టుకొని కూడా డ్రామాను రక్తికట్టించిన సంఘటనలున్నాయి. తాజాగా అటువంటి ఘటనే చోటు చేసుకొంది.

అసలేం జరిగింది..?

ఐరాసలో పాక్‌ దౌత్యవేత్త అయిన మునీర్‌ అక్రమ్‌ ఈ నెల 24న ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఉగ్రవాదం కారణంగా అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు’ అనే నివేదికపై పాక్‌ ప్రతినిధి భద్రతా మండలిలో ఓ ప్రకటన చేశారన్నది దాని సారాంశం. ఈ ట్వీట్‌కు నాలుగు ప్రకటన కాపీలను కూడా జత చేశారు.  ఉగ్రవాదం ముప్పుపై  పాక్‌ ప్రకటన..? ఆశ్చర్యపోకండి. పాక్‌ ప్రతినిధి ఆ ప్రకటనే చేయలేదు. ఈ విషయాన్ని ఐరాసలోని భారత దౌత్యబృందం ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. వీటిల్లో పాకిస్థాన్‌ లేదు. భారత్‌ ఉంది. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతను ఇండోనేషియా చూసుకుంటోంది.  పాక్‌ భద్రతా మండలిలో సభ్యదేశం కాదు. చర్చ జరిగిన రోజు సభ్యులు కాని వారికి ఆహ్వానం కూడా లేదు. ఆ రోజు మాట్లాడే దేశాల జాబితాలో పాకిస్థాన్‌ లేదు. ఈ విషయాన్నే భారత బృందం మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఐదు భాగాలుగా పాక్‌ అబద్ధాలను ఎండగట్టింది.

పాక్‌ ప్రకటనలో అబద్ధాలు..

మొదటి అబద్ధం : ‘‘మేము సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా లక్ష్యంగా మారాం’’ ఇది పాక్‌ కొన్నేళ్లుగా వల్లె వేస్తున్న పచ్చి అబద్ధం. భారత్‌.. పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పేందుకు ఆడే నాటకం. ఐరాస ఆంక్షల జాబితాలోని అత్యధిక మంది ఉగ్రవాదులు పాక్‌లోనే ఉంటారు. పాక్‌ ప్రధానే స్వయంగా ఐరాస వేదికపై తమ దేశంలో దాదాపు 50వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని అంగీకరించారు.

రెండో అబద్ధం: అల్‌ఖైదాను తమ ప్రాంతంలో లేకుండానే చేశామని పాక్‌ చెప్పింది.  అసలు ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా బలగాలు చంపిందే పాక్‌ గడ్డపైన. లాడెన్‌ అక్కడ కొన్నేళ్ల బట్టి ఉన్నా పాక్‌ బయట ప్రపంచానికి తెలియనీయలేదు. పైగా లాడెన్‌ను పాక్‌ ప్రధాని అమరవీరునిగా అభివర్ణించాడు.

మూడో అబద్ధం: భారత్‌ ఉగ్రవాదులును ప్రోత్సహించి పాక్‌లోకి చొప్పిస్తోందని ఆరోపించింది. ఇందుకు కిరాయి మూకను ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ పెట్టింది పేరు. ఇరాన్‌, అఫ్గాన్‌, భారత్‌లోకి కిరాయి మూకలను పంపిన చరిత్ర పాకిస్థాన్‌కు ఉంది. ఒక రకంగా పాక్‌ ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం బాధపడుతోంది. 

నాలుగో అబద్ధం: ఐరాస 1267 ఆంక్షల జాబితాలో భారతీయులు ఉన్నారని పాక్‌ పేర్కొంది. నిజానికి 1267 ఆంక్షల జాబితా అనేది అందరికి అందుబాటులో ఉండే పత్రం. దీనిలో భారతీయులు ఎవరూ ఉండరు. దీనిని ఆధారాలను చూసి  ఐరాస తయారు చేస్తుంది. అంతేకాగానీ కేవలం ఆరోపణల ఆధారంగా కాదు. 

ఐదో అబద్ధం: భారత్‌ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకొంది.  మైనార్టీల భద్రతపై మొసలి కన్నీరు కార్చింది. అసలు పాక్‌లోనే మైనార్టీల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1947తో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ మిగిలిన మూడు శాతం అనేది చాలా తక్కువ.  భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. 

గతంలో తప్పుడు ఫొటోలతో ఆరోపణలు

గతంలో మలీహా లోధీ ఐరాసలో పాక్‌ ప్రతినిధిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి అబద్ధాలే చెప్పారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణల్లో గాయపడ్డవారి ఫొటోలను కశ్మీరీ బాలికగా చూపే యత్నం చేశారు. అప్పట్లో కూడా భారత దౌత్య బృందం దీనిని సమర్థంగా తిప్పికొట్టింది.

ఉగ్రవాదానికి మద్దతుదారుడు ఈ అక్రమ్‌

ప్రస్తుతం అబద్ధాలు వల్లేవేసిన పాక్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌కు క్రిమినల్‌ చరిత్ర కూడా ఉంది. మునీర్‌ గతంలో 2003 నుంచి 2008 వరకు ఐరాసలో పాక్‌ రాయబారిగా పనిచేశారు. అమెరికాలో ఒక మహిళతో సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమే అతడిపై కేసు పెట్టింది. దీంతో దౌత్యవేత్తలకు ఉండే ఇమ్యూనిటీని వాడుకొని అమెరికాలో అరెస్టు నుంచి బయటపడ్డాడు.

* గతంలో కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని స్వతంత్ర పోరాటంగా పేర్కొన్నాడు. 

* రచయిత సల్మాన్‌ ఖుర్షీద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

* భారత్‌ ఉగ్రవాదుల మాతృభూమి అంటూ వ్యాఖ్యలు చేశాడు.

* కశ్మీర్‌ను భారత్‌లో అఫ్గానిస్థాన్‌గా వర్ణిస్తూ పాక్‌ పత్రిక డాన్‌లో వ్యాసం రాశాడు.  హురియత్‌ స్థానంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ నాయకత్వం వహించాలని ఉచిత సలహా ఇచ్చాడు. అప్పట్లో బెనజీర్‌ భుట్టో హత్యను ఐరాసలో ప్రస్తావించడానికి నిరాకరించాడని అక్రమ్‌ను నాటి పాక్‌ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ తొలగించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని