
పరిస్థితులు మరింత క్షీణిస్తాయ్!: ట్రంప్
మాస్కు ధరించాలని అమెరికన్లకు మరోసారి విజ్ఞప్తి
వాషింగ్టన్: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోయే ముందు, అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ట్రంప్ మీడియాతో అన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రం వైరస్ కట్టడికి చాలా బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. మిగతా ప్రాంతాల్లో కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ పరిస్థితులు మరింత దిగజారుతున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారినట్లు వెల్లడించారు.
అత్యంత తీవ్రత కలిగిన ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించాలని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించలేని సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. ‘‘మీకు నచ్చినా, నచ్చకపోయినా వైరస్ నియంత్రణలో మాస్కులు ప్రభావం చూపిస్తాయి’’ అని ట్రంప్ అన్నారు.
ఈ సమయంలో కేవలం మహమ్మారిని నియంత్రించడమే కాకుండా దాన్ని అంతం చేయడమే లక్ష్యం అని అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు వస్తున్నాయని.. అందరూ ఊహించినదానికంటే ముందే ఇవి అందుబాటులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాలో ఇప్పటికే 39లక్షల మంది ఈ వైరస్ బారినపడగా.. లక్షా 41వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి..
మీరు మాస్కు ధరించండి.. నేను ధరించను: ట్రంప్
భారత్: కొవిడ్ మరణాల్లో ప్రపంచంలోనే 7వ స్థానంలోకి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.