భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. విశ్వంలోని అత్యంత అరుదైన విషయమైన బ్లాక్‌హోల్‌పై పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు రోజర్‌ పెన్రోస్‌, రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్‌ పురస్కారం ప్రకటించారు

Updated : 06 Oct 2020 16:27 IST

స్టాక్‌హోం: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. విశ్వంలోని అత్యంత అరుదైన అంశమైన కృష్ణబిలంపై పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు రోజర్‌ పెన్రోస్‌, రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. అయితే ఇందులో రోజర్‌ పెన్రోస్‌కు సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని రిన్‌హార్డ్‌, ఆండ్రియాలు పంచుకోనున్నారు. 

కృష్ణబిలం, పాలపుంతల రహస్యాలను తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్త్లలు అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతమే కృష్ణబిలాలు ఏర్పడటానికి మూలమని రోజర్‌ పెన్రోస్‌ గుర్తించారు. కృష్ణబిలాలు నిజంగా ఉన్నాయనే విషయాన్ని ఐన్‌స్టీన్‌ నమ్మలేదు. అయితే దాన్ని రోజర్‌ తన పరిశోధనలతో నిరూపించారు. ఇక పాలపుంత కేంద్రంలో దుమ్ము, ధూళి, ఇతర వాయువులతో కూడిన దట్టమైన మేఘాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా తమ పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఒక అదృశ్య, భారీ వస్తువు మన గెలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాల కక్ష్యలను నియంత్రిస్తుందని వీరు గుర్తించారు. ఇందుకు గానూ.. ఈ ఏడాది వీరికి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు.

ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న నాలుగో మహిళ ఆండ్రియా గెజ్‌. డోనా స్ట్రిక్‌ల్యాండ్, మరియా గోపెర్ట్ మేయర్, మేరీ క్యూరీ తర్వాత ఈ ఘనత సాధించిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని