అందుకే పార్లమెంటు సమావేశాలు రద్దు: రౌత్‌

రైతుల ఆందోళనల అంశం పార్లమెంటులో చర్చించకూడదనే కేంద్రం శీతాకాల సమావేశాలను రద్దు చేసిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మరి సమావేశాలు నిర్వహించడం ఆసక్తి లేనప్పుడు కొత్త పార్లమెంటు భవనాలు నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు.

Published : 20 Dec 2020 20:45 IST

ముంబయి: రైతుల ఆందోళనల అంశం పార్లమెంటులో చర్చించకూడదనే కేంద్రం శీతాకాల సమావేశాలను రద్దు చేసిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మరి సమావేశాలు నిర్వహించడం ఆసక్తి లేనప్పుడు కొత్త పార్లమెంటు భవనాలు నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శివసేన అధికార పత్రిక సామ్నా వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు.

‘కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల గురించి చర్చ జరగకూడదనే శీతాకాల సమావేశాల్ని రద్దు చేసింది. మరి సభలు నిర్వహించి చర్చలు పెట్టే ఆసక్తి లేనప్పుడు రూ.1000 కోట్లతో నూతన పార్లమెంటు(సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు) నిర్మించడం ఎందుకు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బాగానే ఉంది. ఆ భవనం మరో 50 నుంచి 75 సంవత్సరాల వరకు కూడా బాగానే ఉంటుంది. పూర్వపు నాయకుల గొప్పతనం, జ్ఞాపకాల్ని నాశనం చేయాలని ఎవరూ అనుకోరు. కానీ మీ సొంత ఇమేజ్‌ పెంచుకోవడానికి కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రజాస్వామ్యాన్ని అధిగమించడమే అవుతుంది’ అని రౌత్‌ విమర్శించారు. 

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.1000 కోట్లతో చేపట్టనున్నారు. 2022 ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయానికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26 నుంచి వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

ఇదీ చదవండి

పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని