‘కొత్త’కష్టం: 8గంటలకు పైగా ఎయిర్‌పోర్టులోనే..

బ్రిటన్‌లోని కొత్త కరోనా వైరస్‌ భారత్‌లోనూ అలజడి రేపుతోంది. యూకే నుంచి భారత్‌కు చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25మందికి పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి .........

Published : 24 Dec 2020 01:11 IST

కొవిడ్‌ రిపోర్టుల కోసం పడిగాపులు

దిల్లీ: బ్రిటన్‌లోని కొత్త కరోనా వైరస్‌ భారత్‌లోనూ అలజడి రేపుతోంది. యూకే నుంచి భారత్‌కు చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25మందికి పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. దీంతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్న ప్రయాణికులు తమ రిపోర్టుల కోసం ఎనిమిది గంటలకు పైగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు వచ్చాకే వారిని బయటకు పంపాలనే నిబంధనలు ఉండటంతో దాదాపు 500 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక నియమావళి అనుసరించాల్సి ఉండటంతో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతున్నట్టు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.  

మరోవైపు, బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ కలకలంతో డిసెంబర్‌ 22 నుంచి 31 వరకు విమాన సర్వీసులను భారత్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధానికి ముందు రోజు వరకు యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్‌ తప్పనిసరి చేస్తూ విమానాశ్రయ అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీంతో నిన్న రాత్రి యూకే నుంచి వచ్చిన దాదాపు 500 మంది ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయం వద్ద రిపోర్టుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. భారత్‌తో పాటు 30కి పైగా దేశాలు యూకేకు తాత్కాలికంగా ప్రయాణాలపై నిషేధం విధించాయి. జన్యు మార్పిడి చేసుకున్న ఈ కొత్త రకం వైరస్‌ సెప్టెంబర్‌ నుంచే బ్రిటన్‌లో ప్రబలుతున్నందున ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినవారి ద్వారా మన దేశానికి ఈ వైరస్‌ చేరి ఉండొచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘గత రాత్రి నుంచి విమానాశ్రయంలోనే ఉండిపోయాం. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ భౌతికదూరం ఉల్లంఘన జరుగుతోంది’ అంటూ ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తంచేశారు. 

ఇదీ చదవండి

మందుబాబులు.. నేరుగా నడవండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని