ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలకు భారత్‌లోనూ బ్రేక్‌!

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారుచేసిన వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలకు భారత్‌లోనూ బ్రేక్‌ పడింది

Updated : 10 Sep 2020 16:04 IST

డీసీజీఐ నోటీసు నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్‌ నిర్ణయం

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలకు భారత్‌లోనూ బ్రేక్‌ పడింది. ఆస్ట్రాజెనికా తిరిగి ప్రయోగాలను ప్రారంభించేంత వరకూ భారత్‌లోనూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) సూచనలను అనుసరిస్తున్నామని.. వీటికి సంబంధించి మరింత వ్యాఖ్యానించలేమని పేర్కొంది. అదనపు సమాచారం కోసం డీసీజీఐను సంప్రదించవచ్చని సీరం ఇనిస్టిట్యూట్‌ సూచించింది.

ఇదిలా ఉంటే, మూడోదశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో తాజాగా ఒకరిలో ప్రతికూల ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో తాత్కాలికంగా వీటిని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటించింది. అయితే, దీనిపై భారత్‌లో ప్రయోగాలు నిర్వహిస్తోన్న సీరం ఇనిస్టిట్యూట్‌ మాత్రం బ్రిటన్‌లో జరిగిన ఘటన ప్రభావం ఇక్కడ ఉండదని తొలుత అభిప్రాయపడింది. అంతేకాకుండా ఇక్కడ ప్రయోగాలు యథాతథంగానే జరుగుతాయని సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా నిన్న ప్రకటించారు. ఆ సమయంలోనే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) సీరం ఇనిస్టిట్యూట్‌కు నోటీసులు ఇచ్చింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన దుష్ర్పభావాల సమాచారాన్ని తమకు ఎందుకు తేలియజేయలేదంటూ నోటీసులో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో డీసీజీఐ ఆదేశాలనుసారం ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది.

ఇక బ్రిటన్‌, అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలను కొన్నిరోజులపాటు స్వచ్ఛందంగా ఆపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ ఇప్పటికే ప్రకటించింది. బ్రిటన్‌లో ఓ వాలంటీర్‌ అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆ వాలంటీర్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయనే విషయాన్ని మాత్రం ఆస్ట్రాజెనికా వెల్లడించలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇలాంటివి సర్వసాధారణమే అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని