పింఛను ప్రాథమిక హక్కు.. కోత సరికాదు

వయో వృద్ధుడికి సంబంధించిన పింఛను కేసులో న్యాయస్థానం మార్గదర్శకమైన తీర్పు వెలువరించింది.

Updated : 21 Aug 2020 15:32 IST

85 ఏళ్ల పింఛనుదారుకు అనుకూలంగా కోర్టు తీర్పు

ముంబయి: ఎనభై ఐదు ఏళ్ల వయో వృద్ధుడి పింఛను కేసులో ముంబయి హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. తన పింఛను లోంచి రూ.3,69,035 మొత్తాన్ని సంబంధిత బ్యాంకు రికవరీ చేయటంపై నాగ్‌పూర్‌కు చెందిన నైనీ గోపాల్‌ అనే వృద్ధుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పింఛను ఉద్యోగి ప్రాథమిక హక్కు అని... న్యాయపరమైన అనుమతులు లేకుండా దానిలో కోత విధించటం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి...

నైనీ గోపాల్‌ భండారాలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహించి.. 1994లో పదవీ విరమణ చేశారు. అయితే సాంకేతిక పొరపాటు కారణంగా ఆయనకు ప్రతినెల రూ.782 అదనపు వేతనం చెల్లించినట్టు ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ చెల్లింపు ఆయన పదవీ విరమణ వరకు జరిగిందని.. అనంతరం ఆయన పింఛను మొత్తాన్ని కూడా ఆ వేతనం ఆధారంగానే నిర్ణయించారని ఎస్బీఐ కోర్టుకు తెలిపింది. ఈ విధంగా అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉందని వాదించింది.

తీరు సరికాదు... పరిహారం చెల్లించండి

అయితే బ్యాంకు వాదనను న్యాయమూర్తులు రవి దేశ్‌పాండే, ఎన్‌ బి సూర్యవంశీతో కూడిన ధర్మాసనం  తిరస్కరించింది. పింఛను నుంచి కొంత భాగాన్ని ఎందుకు మినహాయించారో సరైన కారణం చూపలేకపోయిందని వ్యాఖ్యానించింది. అధిక వేతన చెల్లింపునకు దారితీసిన సాంకేతిక కారణం ఏదో కూడా బ్యాంకు తెలియజేయలేక పోవడాన్ని తప్పు పట్టింది. వృద్ధుడి పింఛను గణనలో ఏ లోపమూ లేదని యాజమాన్యం పేర్కొన్న మీదట కూడా.. ఆయన పింఛను మొత్తాన్ని నిర్ణయించేందుకు బ్యాంకుకు అధికారం లేదని స్పష్టం చేసింది. పింఛనుదారుని నుంచి రికవరీ చేయటాన్ని వెంటనే ఆపి.. ఇంతవరకు రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి ఆయన పింఛను ఖాతాలో జమచేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, వయోవృద్ధుని పట్ల బ్యాంకు నిర్లక్ష్య పూరిత వైఖరిని తప్పుపట్టింది. ఇందుకు గాను నైనీ గోపాల్‌కు రూ.50,000 పరిహారాన్ని ఎనిమిది రోజుల్లోగా  చెల్లించాలని.. లేని పక్షంలో రోజుకు రూ.1000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని