ఉగ్రవాద శిబిరాలపై కచ్చితత్వంతో దాడులు

చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ ఘాటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.......

Published : 20 Nov 2020 17:55 IST

ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ యత్నాలకు భారత్‌ విరుగుడు

దిల్లీ: చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఒకపక్క జమ్మూ-కశ్మీర్‌లో కల్లోలం రేపడం, యువతకు ఆయుధాలు అందించడం వంటివి చేస్తూనే.. మరోపక్క తన ప్రమేయం ఎక్కడా బయటపడకుండా చూసుకునేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని తెలిపాయి. తన భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎత్తులు వేస్తోందని సంబంధిత అధికారులు చెప్పారు. కొన్ని వారాలుగా పాక్‌ సైన్యం.. నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని వివరించారు. ఇదంతా జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు మార్గం సుగమం చేయడానికేనని తెలిపారు. ఈ ఏడాది పాక్‌ కాల్పుల్లో 21 మంది పౌరులు చనిపోయారని చెప్పారు. గత ఏడాది 18 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ‘‘ఉగ్రవాదం విషయంలో తన ఆదేశాలను ఉల్లంఘిస్తే వినాశనం తప్పదన్న సందేశాన్ని భారత సరిహద్దు గ్రామాలవారికి అందించేందుకే ఇలాంటి చర్యలకు పాక్‌ పాల్పడుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భారత సైన్యం ప్రతిదాడులకు దిగుతోందని అధికారులు తెలిపారు. పాక్, విదేశీ ముష్కరులను అంతమొందించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు. 

గత శుక్రవారం ఉత్తర కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాలపై పాక్‌ భారీగా కాల్పులకు దిగడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది, పలువురు పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిగా ట్యాంకు విధ్వంసక క్షిపణులు, శతఘ్నులతో భారత సైనికులు జరిపిన దాడిలో 8 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. 12 మంది గాయపడ్డారు. గత ఏడాది పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసినప్పటి నుంచి ముష్కర శిక్షణ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను పాక్‌ ఏర్పాటు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గురువారం నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులకు దిగడం కానీ, తాము ప్రతిచర్యకు పూనుకోవడం కానీ జరగలేదని భారత సైన్యం వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని