ఆలయాలు తెరిచేందుకు మహారాష్ట్ర పచ్చజెండా

సోమవారం నుంచి మహారాష్ట్రలో దేవాలయాలు, ఇతర ప్రార్థనామందిరాలు తెరిచేందుకు శనివారం అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Updated : 15 Nov 2020 11:58 IST

సోమవారం నుంచి అనుమతినిచ్చిన ప్రభుత్వం

ముంబయి: సోమవారం నుంచి మహారాష్ట్రలో దేవాలయాలు, ఇతర ప్రార్థనామందిరాలు తెరిచేందుకు శనివారం అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనుసరించాల్సిన నిబంధనలను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తాజాగా ప్రార్థనామందిరాలపై ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆ కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యనే ఉందని, మాస్కులు తప్పకుండా ధరించాలని  ప్రజలను అప్రమత్తం చేశారు.

‘కరోనా భూతం ఇంకా మన మధ్యనే ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అది ప్రస్తుతం కాస్త నెమ్మదించినట్లు కనిపించినా..ఉదాసీనత వద్దు. ప్రజలు క్రమశిక్షణతో మెలగాలి. హోలి, గణేశ్ చతుర్థి, నవరాత్రులు, ఇతర పర్వదినాలను క్రమశిక్షణతో జరుపుకొన్నట్లే, ఇప్పుడు కూడా నిబంధనలను మదిలో ఉంచుకోవాలి’ అని ఠాక్రే సూచించారు. మహమ్మారి కారణంగా ఆలయాలు మూసివేసి ఉన్నప్పటికీ, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రూపంలో ఆ భగవంతుడు తన ప్రజలను జాగ్రత్తగా చూసుకున్నాడంటూ వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. క్రమశిక్షణ చర్యలు పాటిస్తే..మనకు దేవుడికి ఆశీర్వాదాలు అందుతాయన్నారు. 

కాగా, మార్చి నుంచి మూసి ఉన్న దేవాలయాలు తెరవాలన్న విజ్ఞప్తులు పెరిగిపోవడంతో పాటు, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని అర్చకులు హెచ్చరించారు. భాజపా కూడా ఆలయాలు తెరిచేందుకు అనుమతివ్వాలంటూ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. వీటన్నింటి మధ్య  దీపావళి తరవాత ప్రార్థనామందిరాలకు అనుమతిస్తామంటూ గతవారం ముఖ్యమంత్రి  వెల్లడించారు. వాటితో పాటు పాఠశాలలు పునఃప్రారంభించేందుకు సానుకూలతను వ్యక్తం చేశారు. ‘దేవాలయాలను త్వరలోనే తెరవనున్నాం. దీపావళి తరవాత నిబంధనలను సిద్ధం చేస్తాం. వయసుపైబడిన వారు అక్కడికి వస్తారు. వారికి వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఏ ప్రార్థనాస్థలమైనా సరే.. రద్దీని నివారించాల్సి ఉంది’ అని వెల్లడించారు. అలాగే మాస్కులు ధరించకుండా వచ్చే వారిపై జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించారు.‘ కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వయో వృద్ధుల గురించి ఆలోచిస్తున్నాను. ఒక కొవిడ్ బాధితుడు మాస్క్ ధరించకుండా ఉంటే..అతని వల్ల 400 మందికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. ఇది వైద్యుల లెక్క’ అంటూ తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. అలాగే ఆలయాలు తెరిచే అంశం.. గత నెల ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని