ప్లాస్మా థెరపీతో లాభం లేదు!

కొవిడ్‌-19 మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగపడడం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. కొవిడ్‌-19 తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడంలోనూ.........

Published : 09 Sep 2020 11:20 IST

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: కొవిడ్‌-19 మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగపడడం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. కొవిడ్‌-19 తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడంలోనూ ఈ చికిత్సా విధానం ప్రయోజనం చూపడం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 29 కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో 464 మందిపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ విషయాలు వెల్లడించింది. ఏప్రిల్‌ 22 నుంచి జులై 14 మధ్య ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపింది. కొవిడ్‌ కట్టడి చర్యల్ని పర్యవేక్షించేందుకు ఐసీఎంఆర్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం ఈ అధ్యయనాన్ని ధ్రువపరిచింది. 

ఈ చికిత్సా విధానంలో అనేక మినహాయింపులు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. పరిమిత వసతులుండే సాధారణ ప్రయోగశాలల్లో ఈ థెరపీని చేపట్టడం సాధ్యం కాదని తెలిపింది. చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడం వల్ల ఈ థెరపీ ప్రయోజనంపై స్పష్టత లభించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. 

ఈ అధ్యయనంలో మొత్తం 464 మంది మోతాదు స్థాయిలో కొవిడ్‌ లక్షణాలున్నవారు పాల్గొన్నారు. వీరిలో 235 మందికి ప్రామాణిక చికిత్సా విధానం(బీఎస్సీ)తో పాటు ప్లాస్మా థెరపీ అందించారు. మరో 229 మందికి కేవలం బీఎస్సీని కొనసాగించారు. 28 రోజుల పర్యవేక్షణలో రెండు వర్గాల మరణాల రేటులోగానీ, తక్కువ లక్షణాలున్నవారు విషమ పరిస్థితుల్లోకి వెళ్లడంలోగానీ పెద్దగా తేడా కనిపించలేదని అధ్యయనంలో తేలింది. దీని ఆధారంగా ప్లాస్మా చికిత్స వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

అయితే, ఈ చికిత్స విధానానికి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించింది. కొవిడ్‌ కట్టడి కోసం జూన్‌ 27న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. మోతాదు స్థాయి లక్షణాలున్న వారికి ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ అందజేయొచ్చని తెలిపింది.

ఇదీ చదవండి...

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని