ఆర్టికల్‌ 370 కోసం JKలో కొత్త కూటమి

ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలు ఏకమయ్యాయి. స్వయంప్రతిపత్తి సాధనకు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి ‘పీపుల్స్‌ అలయన్స్‌.......

Published : 15 Oct 2020 22:21 IST

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలు ఏకమయ్యాయి. స్వయంప్రతిపత్తి సాధనకు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌’ అని నామకరణం చేసినట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జద్‌ లోన్‌, ఇతర స్థానిక పార్టీలతో ఈ కూటమి ఏర్పాటు చేసినట్లు ఫరూక్‌ తెలిపారు. 2019 ఆగస్టు 5కు ముందు రాష్ట్ర ప్రజలు అనుభవించిన హక్కులను (ఆర్టికల్‌ 370) తమకు తిరిగి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 

జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి, రాష్ట్రాన్ని గతేడాది రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి అన్ని పార్టీలు పోరాడాలని ‘గుప్కర్‌ డిక్లరేషన్‌’ పేరిట ఒక ప్రకటనను వెలువరించాయి. దానికి కొనసాగింపుగా భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో తాజా సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో ఒమర్‌ అబ్దుల్లా, సీపీఎం నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని ఫరూక్‌ అబ్దుల్లా  సమావేశం అనంతరం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని