చర్చించాలి కానీ, వాకౌట్‌ చేయడమేంటి?

దేశంలో ప్రతిపక్ష పార్టీలవి దిశానిర్దేశం లేని రాజకీయాలని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వాటిపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బిల్లులు లేదా ఇతర అంశాలపై చర్చించడానికి సభలో అవకాశం వస్తే వారు సభ నుంచి వాకౌట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు.

Updated : 24 Sep 2020 16:50 IST

దిల్లీ: దేశంలో ప్రతిపక్ష పార్టీలవి దిశానిర్దేశం లేని రాజకీయాలని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వాటిపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బిల్లులు లేదా ఇతర అంశాలపై చర్చించడానికి సభలో అవకాశం వస్తే వారు సభ నుంచి వాకౌట్‌ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ‘సంవత్సరంలో పార్లమెంటు సమావేశాలు దాదాపు 70 రోజులు ఉంటాయి. కేంద్రం ఏదైనా బిల్లు సభలో ప్రవేశపెట్టినపుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. వాటిపై చర్చించాలి. అప్పుడు వారు మాట్లాడటాన్ని ఎవరూ అడ్డుకోరు. అంతేకానీ, సభ నుంచి వాకౌట్‌ చేయడం సరైన పద్ధతి కాదు. సభలో మాట్లాడకుండా రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లడం, నిరసనలు వ్యక్తం చేయడం వంటి వాటికి ఇంకా 300రోజుల సమయం ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు దానిపై చర్చలకు తావు లేకుండా వ్యతిరేకించడం బాధాకరం. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రవర్తించిన తీరు ఎంతో అవమానకరం’ అని విమర్శించారు.  

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడాన్ని జావడేకర్‌ ప్రశంసించారు. ఈ బిల్లుల ద్వారా దేశంలోని రైతులకు ఓ వరం లభించినట్లయిందన్నారు. ‘కనీస మద్దతు ధర ఉండదని, మార్కెట్‌ కమిటీలను మూసేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఆ వ్యవస్థలు కొనసాగుతాయి’ అని స్పష్టం చేశారు.

అదేవిధంగా బుధవారం పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు కార్మిక బిల్లులను ఉద్దేశిస్తూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్ల తర్వాత కార్మికులకు భద్రత కల్పించే బిల్లును కేంద్రం తీసుకు వచ్చిందన్నారు. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా 50కోట్ల కార్మికులకు కనీస వేతనం, సామాజిక, ఆరోగ్య భద్రత లభిస్తుందని చెప్పారు. స్త్రీ, పురుషులకు సమాన వేతనం, వైద్య పరీక్షలు సహా పలు ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఈ బిల్లు తీసుకురావడం ఓ విప్లవాత్మక నిర్ణయమన్నారు. కానీ అలాంటి బిల్లులకు సంబంధించిన చర్చలకు ప్రతిపక్షాలు రాకపోగా.. మళ్లీ కేంద్రాన్ని నిందించడం తప్పు అని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని