పిల్లల గుండెకు కొవిడ్‌ ముప్పు!

ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.........

Published : 06 Sep 2020 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. అందులో ఒకటైన మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌) పిల్లల గుండెపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. దీంతో కొవిడ్‌ సోకిన పిల్లల గుండె పనితీరును వారి జీవిత కాలం పర్యవేక్షించాల్సిన అవసరం ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు లాన్సెట్‌‌కు చెందిన ఈక్లినికల్‌మెడిసిన్‌ అనే జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 నుంచి జులై 25 మధ్య ఎంఐఎస్‌తో ఆస్పత్రుల్లో చేరిన 662 మంది పిల్లలపై అధ్యయనం జరిపారు. అందుకు సంబంధించిన ఫలితాలను ప్రచురణలో పొందుపరిచారు.

లక్షణాలు లేకపోయినా..

పిల్లల్లో కరోనా వైరస్‌ తొలి రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని అధ్యయనంలో గుర్తించారు. వైరస్‌ సోకినా తొలి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు మహమ్మారి బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను జాగ్రత్తగా పరీక్షిస్తే.. కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న తీవ్ర సమస్యగా నిర్ధారణ అవుతోంది. 

అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన ఇతర అంశాలు...

* ఎంఐఎస్‌తో ఆస్పత్రిలో చేరిన వారిలో 71 శాతం మంది ఐసీయూలో చేరారు. 
* 60 శాతం మంది షాక్‌కు గురయ్యారు. 
* ఒక్కొక్కరు సగటున 7.9 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోంది. 
* 100 శాతం మంది జ్వరం, 73.7 శాతం మంది డయేరియా లేదా కడుపునొప్పి, 68.3 శాతం మంది వాంతులతో బాధపడ్డారు. 
* 90 శాతం మందికి ఎకోకార్డియోగ్రామ్‌(ఈసీజీ) పరీక్ష చేయాల్సి వచ్చింది. 54 శాతం మందిలో అసాధారణ ఫలితాలు వచ్చాయి. 
* 22.2 శాతం మందికి కృత్రిమ శ్వాస అందించాల్సి వచ్చింది. 
* 4.4 శాతం మందికి ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌(ఈసీఎంవో)అవసరమైంది.
* 11 శాతం మంది చనిపోయారు.

కవాసకీ కంటే అధిక ప్రభావం..

ఈ కొత్త వ్యాధి పిల్లల్లో పలు అవయవాలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనంలో పాల్గొన్న యూనిర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ హెల్త్‌ సైన్సెస్‌ సెంటర్‌లో పనిచేస్తున్న పిల్లల వైద్య నిపుణుడు డా.మొరేరా తెలిపారు. కవాసకీ, టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌తో పోలిస్తే ఎంఐఎస్‌ ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. అయితే కవాసకీ వ్యాధికి చేస్తున్న చికిత్స కొంత మందిలో వ్యాధిని తగ్గించినట్లు తెలిపింది. 

గుండెపై పెను ప్రభావం..

ఇక గుండె పనితీరులో చాలా మార్పు వచ్చినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. 90 శాతం మందిలో గుండె సమస్య సంబంధిత లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. శరీరానికి ఆక్సిజన్‌సహిత రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం గుండెకు తగ్గిపోయిందని వెల్లడించారు. అలాగే అక్కడక్కడా సిరల్లో వాపు కనిపించినట్లు తెలిపారు. ఈ లక్షణాలు తిరగబెట్టే అవకాశం ఉండడంతో వీరిని నిశిత పరిశీలనలో ఉంచాల్సిన అసవరం ఉందన్నారు. కొంతమందిలో ఇది జీవితకాలం ఉండిపోయే ప్రమాదం ఉందన్నారు. గుండె కణజాలం కూడా దెబ్బతింటున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో కొవిడ్‌ అనంతరం ఉత్పన్నమవుతున్న అనారోగ్య సమస్యల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 

ఇదీ చదవండి..
కొవిడ్‌ కొత్త పోకడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని