ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చి, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌........

Updated : 31 Aug 2020 22:33 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి..

‘ప్రణబ్‌ దా’గా సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకొనే 84 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు పొందారు.

కుటుంబ నేపథ్యం..

పశ్చిమ బెంగాల్‌లోని మిరాటిలో 1935 డిసెంబర్‌ 11న ప్రణబ్‌ జన్మించారు. ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌ శాసన మండలిలో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రణబ్‌ పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రలో మాస్టర్స్‌ పట్టాలను పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను సాధించారు. సువ్రా ముఖర్జీని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ  2015 ఆగస్టులో కన్నుమూశారు.

రాజకీయ ప్రస్థానమిలా..

రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి ముందు ప్రణబ్‌ డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌గా బాధ్యతలు చేపట్టారు. 1963లో ఆయన విద్యానగర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగాలీ పత్రిక ‘దెషర్‌ దక్‌’లో పాత్రికేయుడిగానూ పనిచేశారు. రాజకీయాల్లో ప్రణబ్‌ కీలక అడుగు 1969లో పడింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు పంపారు.  ఆ తర్వాత ఆయన ఇందిరకు అత్యంత నమ్మకస్తుడిగా ఎదిగారు. 1973లో ఆమె మంత్రివర్గంలో బెర్త్‌ సాధించారు. 47 ఏళ్ల వయసులోనే 1982లో ఆయన దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. తద్వారా భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. 

ఇందిరకు తానే తగిన రాజకీయ వారసుడినని ప్రణబ్‌ భావించారు. అయితే ఆ బాధ్యతను ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ చేపట్టడంతో ఆయన రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ పెట్టుకొన్నారు. 1989లో దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1995లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

1998లో కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా సోనియా గాంధీని ఒప్పించడంలో ప్రణబ్‌ కీలక పాత్ర పోషించారు. సంక్లిష్ట సమయంలో ఆమెకు మార్గనిర్దేశం చేశారు. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన తొలిసారిగా లోక్‌సభ నుంచి గెలుపొందారు. 2012 వరకూ ఆయన కీలకమైన విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకూ ఆయన దేశ 13వ రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తించారు. గట్టి కాంగ్రెస్‌వాదిగా పేరొందిన ప్రణబ్‌ గత ఏడాది నాగ్‌పుర్‌లో జరిగిన ఒక ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరుకావడం కొన్ని వర్గాల నుంచి విమర్శలకు దారితీసింది.

అవార్డులు: 2019లో భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నారు.

ఇదీ చదవండి...

ప్రణబ్‌ దాదా.. రాజకీయ కాళిదాసు!

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది

ప్రమాణస్వీకారం చూడ్డానికెళ్లి.. మంత్రిగా వచ్చి..!




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని