ప్రణబ్‌ దాదా.. రాజకీయ కాళిదాసు!

దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది. చరిత్ర పుటలను నాలుక కొసన.......

Updated : 31 Aug 2020 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మనకు ఇకలేరు. పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడైన ప్రణబ్‌ దాదా సోమవారం సాయంత్రం దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది ఆయన. చరిత్ర పుటలను నాలుక కొసన పెట్టుకున్న రాజకీయ కాళిదాసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా ప్రసంగించగలిన వాచస్పతి. మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. తెరవెనక మంత్రాంగం నెరపడంలోనూ సిద్ధహస్తుడు. సంక్షోభ సమయంలో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన ప్రణబ్‌ ముఖర్జీ జీవిత ప్రస్థానంలోని విశేషాలు..

సంక్షోభ పరిష్కర్త
పార్టీలోనూ, పార్లమెంట్‌ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్‌ ముఖర్జీనే. రాజీవ్‌ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. తుదిశ్వాస వరకు ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా.. ప్రణబ్‌కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్‌ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

* ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్‌ పవార్‌, తారిఖ్‌ అన్వర్‌, పీఏ సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతనూ మళ్లీ ప్రణబ్‌కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది కూడా ప్రణబ్‌ అనే చెబుతారు.

* విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి.

ఇందిరకు విశ్వాసపాత్రుడు

2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్‌ ఎప్పుడూ లోక్‌సభకు ఎన్నికకాలేదు. అయినా ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్‌ అయిన ప్రణబ్‌కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు. 

రాజీవ్‌తో విభేదాలు

ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు రాజీవ్‌ గాంధీకి ప్రణబ్‌ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్‌, ప్రణబ్‌ బెంగాల్‌లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్‌.. ప్రణబ్‌ను అడిగితే అత్యంత సీనియర్‌ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని, నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్‌ అన్నట్టు చెబుతారు. అప్పటికి ప్రణబ్‌ ముఖర్జీయే సీనియర్‌ మంత్రి. ఇది రాజీవ్‌ ఆగ్రహానికి కారణమైందని చెబుతారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో  స్థానం కల్పించకుండా ప్రణబ్‌ హోదాను తగ్గిస్తూ ఆయన్ను బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్‌ నియమించడంతో కినుక వహించి 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించారు. అప్పట్లో రాజీవ్‌ ఆయన్ను కాంగ్రెస్ ‌నుంచి బహిష్కరించారు కూడా. 1987లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  కొత్త పార్టీ పేరుపై పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మునుపటి ప్రాధాన్యం లభించలేదు. పీవీ నరసింహారావు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ పూర్వ వైభవం సాధ్యమైంది.

మరోసారి చేజారిన ప్రధాని అవకాశం
రాజీవ్‌ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ నాయకత్వం చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్‌ ముఖర్జీయే సీనియర్‌. అయితే, అంతకముందు పార్టీ వీడి మళ్లీ చేరడంతో సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి పార్టీ పరంగా అనర్హులయ్యారు. సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించిన తర్వాత ప్రణబ్‌ ఆమె కోటరీలో కీలక వ్యక్తిగా అవతరించారు. కఠిన సమయాల్లో సముచిత సలహాలిస్తూ అధిష్ఠానానికి విధేయుడిగా మెలిగారు ప్రణబ్‌.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా..!

47 ఏళ్ల వయస్సులో తొలిసారి పెద్ద ఆఖ అయిన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టి.. ఆర్థికశాఖను పిన్న వయస్సులో చేపట్టిన మంత్రిగా ప్రణబ్‌ పేరు పొందారు. 1984లో యూరోమని మ్యాగజీన్‌ నిర్వహించిన ఓ సర్వేలో ప్రణబ్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. ప్రణబ్‌ కార్యదక్షత దేశీయ వ్యవహారాలకే పరిమితం కాదు. అణుఒప్పందం వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు జరిపిన సమర్థత ఆయనది.

ఇదీ చదవండి...

ప్రమాణస్వీకారం చూడ్డానికెళ్లి.. మంత్రిగా వచ్చి..!

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని