ఆపాలని అభిజిత్‌.. ఆటంకాలొద్దని శర్మిష్ఠ

మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’పై ఆయన కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని వెంటనే ఆపేయాలని ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ప్రచురణకర్తలను కోరగా...

Published : 17 Dec 2020 01:24 IST

ప్రణబ్‌ పుస్తకంపై కుమారుడు, కుమార్తెల వాగ్వాదం

దిల్లీ: మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’పై ఆయన కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని వెంటనే ఆపేయాలని ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ప్రచురణకర్తలను కోరగా.. అనవసర ఆటంకాలు సృష్టించవద్దంటూ ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన సోదరుడికి సూచించారు. టిట్టర్‌ వేదికగా ఇద్దరూ ఈ పుస్తక ప్రచురణ అంశంపై విభేదించారు. వచ్చే జనవరిలో రూపా పబ్లిషర్స్‌ ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్న ఈ పుస్తకంలోని పలు అంశాలు ఇటీవల వార్తలకెక్కాయి. ఇందులో కాంగ్రెస్‌పై ప్రణబ్‌ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ దృష్టిని కోల్పోయినట్లు ప్రణబ్‌ తన ఆత్మకథలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వైఖరిపైనా ప్రణబ్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అభిజిత్‌ - తాను సమ్మతిని తెలిపేంతవరకు ఈ పుస్తకాన్ని ప్రచురించవద్దని ప్రచురణకర్తలను కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. తక్షణం ప్రచురణను నిలిపివేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ‘‘ఇందులోని కొన్ని ప్రేరేపిత అంశాలు వార్తలకెక్కాయి. నా తండ్రి దివంగతులైన నేపథ్యంలో ఆయన కుమారుడిగా పుస్తకం తుదిప్రతి(ఫైనల్‌ కాపీ)లోని అంశాలను ప్రచురణకు ముందే నేను పరిశీలించాలని అనుకుంటున్నాను. నా తండ్రి జీవించి ఉంటే ఆయన కూడా అదేపని చేసేవారు.’’ అని పేర్కొన్నారు.

సోదరా.. ఆపవద్దు : శర్మిష్ఠ

అభిజిత్‌ వ్యాఖ్యలపై ఆయన సోదరి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శర్మిష్ఠ స్పందించారు. ‘‘పుస్తక రచయిత కుమార్తెగా నేను నా సోదరుడు అభిజిత్‌ను కోరుతున్నాను. మన తండ్రి రాసిన చివరి పుస్తకం ప్రచురణకు అనవసర ఆటంకాలు సృష్టించొద్దు. ఆయన అనారోగ్యానికి గురికాకముందే లిఖితప్రతిని పూర్తి చేశారు. తుది ముసాయిదాలో తన తండ్రి చేతిరాతతో విషయాలు, వ్యాఖ్యలు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉండాలి.’’ అని పేర్కొన్నారు. తన తండ్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతమని, చౌకబారు ప్రచారం కోసం వాటిని ప్రచురితం కాకుండా ఎవరూ ఆపేందుకు ప్రయత్నించవద్దని కూడా సూచించారు. అది దివంగత నేతకు చేసే అపకారం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుస్తకం పేరును అభిజిత్‌ తప్పుగా పేర్కొనడాన్ని ఆమె ప్రస్తావించగా.. అనంతరం అభిజిత్‌ ఆ పేరును మరో ట్వీట్‌లో సరిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని