ఐదుగురిని అపహరించిన చైనా బలగాలు!

అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ (పీఎల్‌ఏ) ఆర్మీ సైనికులు అపహరించారు. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్‌ సుబన్‌సిరి...........

Published : 06 Sep 2020 01:03 IST

ఇటానగర్‌: అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు అపహరించారు. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్‌ సుబన్‌సిరి జిల్లాలో నాచో ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతంలో కొందరు వేటకు అడవిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయి. అదే బృందంలో ఉన్న ఇద్దరు తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులను కలిశారు. ఆర్మీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ కూడా దీనిపై పీఎంవోకు ఫిర్యాదు చేశారు. చైనా బలగాలు ఐదుగురు పౌరులను అపహరించాయని, గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. చైనా బలగాలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరుతూ ట్వీట్‌ చేశారు. వాస్తవాధీన రేఖను దాటి చైనా బలగాలు దేశంలోకి చొరబడ్డాయని ఓ టీవీ ఛానల్‌తో పేర్కొన్నారు. ఈ ఘటనపై అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాచో పోలీస్‌స్టేషన్‌కు విచారణ అధికారిని పంపించామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని