ఎట్టకేలకు..బైడెన్‌ను అభినందించిన పుతిన్‌

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎట్టకేలకు అభినందనలు తెలిపారు.

Published : 15 Dec 2020 17:51 IST

మాస్కో: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎట్టకేలకు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజు పుతిన్‌ అభినందనలు తెలపడం గమనార్హం. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. రష్యా, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరుదేశాలు ప్రత్యేక బాధ్యతగా ముందుకెళ్తాయనే నమ్మకాన్ని పుతిన్‌ వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమానత్వ భావం, పరస్పర గౌరవంతో ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సమాజ శ్రేయస్సు కోసం సహకరిస్తామని తెలిపారు. ఇక బైడెన్‌తో కలిసి చర్చించేందుకు పుతిన్‌ సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షభవనం వెల్లడించింది.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌కు ఎక్కువ స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా మీడియా జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్న సమయంలోనే యావత్‌ ప్రపంచనేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, పుతిన్‌ మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో దావా వేయడం వంటి కారణాలను పుతిన్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ను అమెరికా ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే బైడెన్‌ను అభినందిస్తానని రష్యా అధ్యక్షుడు ఇదివరకే స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌లను తాజాగా ఎలక్టోరల్‌ కాలేజీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చదవండి..
బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తించను: పుతిన్‌
ట్రంప్‌ ఇక ఇంటికే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని