ప్రపంచంలో పావువంతు ప్రజలకు టీకా కష్టమే!

2022నాటికి ప్రపంచంలో పావువంతు జనాభాకు వ్యాక్సిన్‌ అందకపోవచ్చని తాజాగా ఓ అధ్యయనం అంచనా వేసింది.

Published : 16 Dec 2020 19:24 IST

2022నాటికి సాధ్యం కాకపోవచ్చంటున్న అధ్యయనాలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోన్న వేళ.. కొన్ని దేశాల్లో అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చింది. అయితే, 2022నాటికి ప్రపంచంలో పావువంతు జనాభాకు వ్యాక్సిన్‌ అందకపోవచ్చని తాజాగా ఓ అధ్యయనం అంచనా వేసింది. వ్యాక్సిన్‌ తయారీ మాదిరిగానే వాటిని సరఫరా చేయడం కూడా అంతే సవాళ్లతో కూడుకున్నదని బి.ఎం.జే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 370కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇదే జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం వెల్లడించింది.

అధిక ఆదాయ దేశాలదే పైచేయి..
కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి దశలో ఉన్నప్పుడే అధిక ఆదాయ దేశాలు జాగ్రత్తపడ్డాయి. వ్యాక్సిన్‌ కోసం ముందస్తు చెల్లింపులు చేసి, వాటి డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చుకున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ కంపెనీలు ఆయా దేశాలకు మాత్రమే తొలుత సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మధ్య, అల్ప ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండనున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఏవిధంగా కృషిచేస్తున్నారో..వ్యాక్సిన్‌ పంపిణీ కూడా అలాంటి సవాళ్లతో కూడుకున్నదని స్పష్టంచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం వివిధ దేశాలు చేస్తోన్న ముందస్తు ఆర్డర్లను పరిగణలోకి తీసుకొని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనిర్సిటీకి చెందిన నిపుణులు అధ్యయనం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు భారీ‌ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా వ్యాక్సిన్‌ పంపిణీ వ్యూహాలు ఉండాలని తాజా నివేదికలో నిపుణులు సూచిస్తున్నారు.

748కోట్ల డోసుల బుకింగ్..
తాజా అధ్యయనంలో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న 48 టీకాలను నిపుణులు పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో నవంబర్‌ 15, 2020 నాటికి చాలా దేశాలు 748కోట్ల డోసులను 13 వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను నుంచి రిజర్వు చేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో దాదాపు 50శాతానికి పైగా డోసులు ప్రపంచంలో కేవలం 14శాతం జనాభా ఉన్న అధిక ఆదాయ దేశాలకే వెలుతాయని అంచనా వేశారు. మిగతా డోసులు 85శాతం జనాభా కలిగిన అన్ని దేశాలకు అందించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్‌ అభివృద్ధి కంపెనీలు తమ లక్ష్యాలను పూర్తి చేసినప్పటికీ 2022నాటికి ప్రపంచ జనాభాలో ఐదోవంతు ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండకపోవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

ప్రభుత్వాల చొరవతో..
టీకాలను పారదర్శకంగా అన్ని దేశాలకు అందించడంలో ప్రభుత్వాల చొరవ ఎంతో ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ కంపెనీలు, ప్రభుత్వాల చొరవతో వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు అందించే వీలుందని సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌లను ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తయారుచేయడం, కొనుగోలు, పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను తాజా పరిశోధన వివరిస్తుందని అధ్యయన రూపకర్తలు వెల్లడించారు. ప్రపంచదేశాలకు వ్యాక్సిన్‌లను సమానంగా పంపిణీ చేసే ప్రయత్నంలో భాగంగా కోవాక్స్‌ కూటమీగా ఏర్పడి తమ నిబద్ధతను చాటుకున్నాయని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ జాసన్‌ షెవార్ట్‌ అభిప్రాయపడ్డారు. 

ఇవీ చదవండి..
ఒకే టీకాపై ఆధారపడొద్దు..!
ట్రంప్‌: టీకా తీసుకునేందుకు సిద్ధం..కానీ..,
కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని