వాటి వల్ల రఫేల్‌ యుద్ధవిమానాలకు నష్టం

అత్యంత శక్తివంతమైన రఫేల్‌ విమానాలకు... సాధారణ పక్షులు సమస్యగా మారాయి.

Published : 03 Sep 2020 02:41 IST

సత్వర చర్యలు కోరుతూ ఉన్నతాధికారుల లేఖ

అంబాలా: భారతీయ వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేస్తూ.. ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు జులై 29న పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరాయి. ఈ లోహ విహంగాలు సెప్టెంబర్‌ 10న భారతీయ వాయుసేనలో అధికారికంగా భాగమౌతాయి. అయితే అత్యంత శక్తిమంతమైన ఈ విమానాలకు.. సాధారణ పక్షులు సమస్యగా మారాయి. వైమానిక స్ధావరం చుట్టుపక్కల పేరుకున్న చెత్తా చెదారం పక్షులకు నెలవైంది. ఈ పక్షులు రఫేల్‌ యుద్ధవిమానాలకు తీవ్రమైన నష్టాన్ని కలుగచేయగలవని అధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ భారతీయ వాయుసేన డైరక్టర్‌ జనరల్‌ (ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సేఫ్టీ)ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌, హరియాణా చీఫ్‌ సెక్రటరీ కేశ్నీ ఆనంద్‌ అరోరాకు ఓ లేఖ రాశారు.  
‘‘అంబాలాలో ఉన్న రఫేల్‌ విమానాల భద్రత, రక్షణ భారత వైమానిక దళానిది ప్రధాన బాధ్యత. అయితే ఈ పరిసరాల్లో అధిక సంఖ్యలో పక్షులు సంచరిస్తున్నాయి. ఇవి విమానాలను ఢీకొంటే నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రదేశంలో పక్షుల సంచారాన్ని నియంత్రించేందుకు అనేక సూచనలు, విజ్ఞప్తులు చేశాం. వీటి బెడదను నివారించేందుకు సరైన వ్యర్థ నిర్వహణ విధానం అనుసరించాలి. ఇక్కడ చెత్త పారబోసే వారికి జరిమానా విధించడం తదితర చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా, ఎయిర్‌ఫీల్డ్‌కు దూరంగా వ్యర్థ నిర్వహణ ప్లాంటులను ఏర్పాటు చేయాలి’’ అని తన లేఖలో పేర్కొన్నారు. 
అంబాలా వైమానిక స్థావరం చుట్టుపక్కల 10 కి.మీ ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను తొలగించే విషయమై ఇప్పటికే మూడు సార్లు సమావేశమై మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని