నిరుద్యోగంపై రాహుల్‌ హెచ్చరిక!

రాబోయే రోజుల్లో దేశంలో నిరుద్యోగం పెరగనుందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. యువతకు ఉపాధి కల్పించే పరిస్థితులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విధానాలే ఇందుకు..

Published : 20 Aug 2020 20:41 IST

దిల్లీ: రాబోయే రోజుల్లో దేశంలో నిరుద్యోగం మరింతగా పెరగనుందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతో భవిష్యత్తులో యువతకు ఉపాధి కల్పించలేని పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. గతంలోనే తాను ఇదే విషయంపై హెచ్చరించినప్పుడు మీడియా తనను ఎగతాళి చేసిందన్నారు. ఈ మేరకు వర్చువల్‌ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘రాబోయే రోజుల్లో దేశంలో యువతకు ఉపాధి కల్పించలేని పరిస్థితి తలెత్తుతుంది. గత 70 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ ఏర్పడలేదు. కొవిడ్‌ కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ ఏడాది మొదట్లో నేను చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. కానీ జరగబోయేది అదే. ఒకవేళ నా మాటలు నమ్మకపోతే ఆరేడు నెలలు వేచి చూడండి’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అసంఘటిత రంగం దెబ్బతినడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. 90 శాతం ఉపాధి ఆ రంగమే కలిపిస్తోందని, ఈ వ్యవస్థను ప్రధాని మోదీ పూర్తిగా నాశనం చేశారని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం గడువు ముగిశాక ఒక్కో కంపెనీ మూతపడడం చూస్తారని వ్యాఖ్యానించారు. గడిచిన 4 నెలల వ్యవధిలో 2 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారంటూ నిరుద్యోగంపై నిన్న చేసిన ట్వీట్‌లో రాహుల్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని