సరిహద్దుల నుంచి వెంటనే వెళ్లిపోండి!

సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు......

Updated : 05 Sep 2020 15:36 IST

మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన భారత్‌

మాస్కో: సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఘె మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రారంభమైన తర్వాత ఇలాంటి అత్యున్నత స్థాయి భేటీ ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌, ఫెంఘెలు మాస్కో వచ్చారు. 

సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తున్న దురుసు వైఖరిపై ఈ భేటీలో భారత్‌ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్‌ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, బలగాల్ని వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం చల్లార్చేలా చర్చలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ భేటీకి రాజ్‌నాథ్‌ వెంట రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, రష్యాలో భారత రాయబారి డి.బి.వెంటకేశ్‌ వర్మ హాజరయ్యారు. 

అంతకుముదు ఎస్‌సీవో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాజ్‌నాథ్‌.. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు పరిరక్షించుకోవాలంటే దురుసుతనాన్ని వీడాలని చైనాకు పరోక్ష హితబోధ చేశారు. ఒక దేశం మరో దేశంపై ప్రదర్శించిన దురుసుతనం వల్ల అందరూ నష్టపోవడాన్ని రెండో ప్రపంచ యుద్ధం కళ్లకు కట్టిందని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని