ఆగస్టులో రామమందిరం నిర్మాణం ప్రారంభం

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో..

Published : 18 Jul 2020 21:01 IST

3న లేదా 5వ తేదీన భూమిపూజ చేయనున్న ప్రధాని

దిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులోనే భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని వచ్చే వీలును బట్టి ఆగస్టు 3న లేదా 5వ తేదీన భూమి పూజకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రాంతంలో ప్రధాని మోదీ మొదటి పర్యటన ఇదే కానుంది. ‘ఆగస్టు 3 లేదా 5వ తేదీన రామమందిరం భూమి పూజకు రావాలని ప్రధాని మోదీకి విన్నవించాం. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాం’ అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారి వెల్లడించారు.

ట్రస్టు సమావేశానికి అనేక మంది ట్రస్టు సభ్యులు హాజరు కాగా ముగ్గురు సభ్యులు.. వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ‘లార్సెన్‌ అండ్‌ టర్బో సంస్థ పరీక్షల కోసం మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఆలయ నమూనాలను సిద్ధం చేస్తోంది. అవి సిద్ధమవగానే వాటి ఆధారంగా ఆలయాన్ని నిర్మించనున్నాం’ అని ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ తెలిపారు. వర్షాకాలం తర్వాత దేశంలోని నాలుగు లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల కుటుంబాలను సంప్రదించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి 3 నుంచి 3.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని