అమృతా.. మీ పేరూ చూసుకోండి: శివసేన

బిహార్‌ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన పార్టీపై విమర్శలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతకు శివసేన కౌంటర్‌ ఇచ్చింది. నోటిని అదుపులో ఉంచుకోవాలని...

Updated : 14 Nov 2020 15:17 IST

‘శవ సేన’ అని విమర్శించిన ఫడణవీస్‌ భార్యకు పంచ్‌

ముంబయి: బిహార్‌ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన పార్టీపై విమర్శలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతకు శివసేన కౌంటర్‌ ఇచ్చింది. నోటిని అదుపులో ఉంచుకోవాలని.. మీ పేరులోనూ శవం ఉందని హెచ్చరించింది. బిహార్‌ ఫలితాల అనంతరం స్పందించిన అమృతా ఫడణవీస్‌ అక్కడ ప్రభావం చూపని శివసేన లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పార్టీని ‘శవ సేన’ అని ఎద్దేవా చేశారు. ‘శవ సేన బిహార్‌లోని సొంత సహచరులను (కాంగ్రెస్‌) చంపుకొంది. మహారాష్ట్రను ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియదు కానీ బిహార్‌ను మాత్రం సరైనవారి చేతిలో పెట్టినందుకు ధన్యవాదాలు’ అని విమర్శించారు. 

అమృత వ్యా‌ఖ్యలపై శివసేన దీటుగా స్పందించింది. మీ పేరులో ఉన్న వర్ణమాలను కూడా ఒకసారి పరిశీలించుకోవాలని సూచించింది. ‘‘మీ పేరు అమృతలోని 'ఏ' అక్షరం ప్రాముఖ్యత గ్రహించండి. మీ పేరులోని మొదటి అక్షరం ఎగిరిపోతే ‘మృత’ (మరాఠీలో మృతి) మిగులుతుంది. దివాళి పర్వదినాన మీ మదిలోకి చెడు ఆలోచనలను రానివ్వకండి. శివసేన పేరు వాడడం ద్వారా మీకు ఎలాంటి లాభం లేదు’ అని శివసేన అధికార ప్రతినిధి నీలమ్‌ గోరే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ బిహార్‌ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. బిహార్‌లో భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడిపారు. దీంతో ఆ పార్టీ 74 సీట్లు సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీచేసిన శివసేనకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేకపోయింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని