నాన్న మరణంపై బిల్‌గేట్స్‌..!

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్‌గేట్స్‌ తండ్రి విలియం హెన్రీ గేట్స్‌ II కన్నుమూశారు. చాలాకాలంగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న విలియం హెన్రీ సోమవారం మరణించినట్లు బిల్‌గేట్స్‌ వెల్లడించారు.

Published : 17 Sep 2020 01:29 IST

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్‌గేట్స్‌ తండ్రి విలియం హెన్రీ గేట్స్‌ II కన్నుమూశారు. చాలాకాలంగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న విలియం హెన్రీ సోమవారం మరణించినట్లు బిల్‌గేట్స్‌ వెల్లడించారు. తండ్రి మరణం కుటుంబానికి తీరనిలోటు అని బిల్‌గేట్స్‌ విచారం వ్యక్తం చేశారు. 94ఏళ్ల హెన్రీ ఎంతో అర్థవంతమైన జీవితం గడిపారని..తన వ్యక్తిగత జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను బిల్‌గేట్స్‌ గుర్తుచేసుకున్నారు. 1925లో వాషింగ్టన్‌లో హెన్రీ గేట్స్‌ జన్మించారు.

‘తన తండ్రి నుంచి జ్ఞానంతో పాటు వినయ, విధేయతలను నేర్చుకోవడాన్ని నేను ఎప్పుడూ మరవలేదు. తమ వితరణ కార్యక్రమానికి ఎంతో తోడ్పాటునందించిన ఆయనకు నేను, మిలిండా ఇద్దరం రుణపడి ఉన్నాం. నా ప్రతి ప్రయత్నంలో ఆయన భాగస్వామ్యం ఉంది’ అని తన జ్ఞాపకాలను బిల్‌గేట్స్‌ బ్లాగ్‌లో వివరించారు.

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ తన బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వితరణ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్‌ ప్రారంభించడంలో హెన్రీ గేట్స్‌ కీలక పాత్ర పోషించినట్లు బిల్స్‌ పలుసార్లు స్పష్టంచేశారు. పోలియో నిర్మూలన, చిన్నారులకు టీకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఫౌండేషన్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని