ఆ చట్టాల్ని రద్దు చేసి..కొత్తవి తేవాలి: చిదంబరం

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులతో ఒప్పందానికి వచ్చి కొత్తగా బిల్లుల్ని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు.

Updated : 15 Dec 2020 21:48 IST

దిల్లీ: కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులతో ఒప్పందానికి వచ్చి కొత్తగా బిల్లుల్ని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

‘నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల విషయంలో కేంద్రం త్వరగా దిగి రావాలి. వారిని సంప్రదించి త్వరగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ప్రస్తుత చట్టాలను రద్దు చేసి.. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్త చట్టాల్ని తీసుకురావాలి. అదే సమస్య పరిష్కారానికి సులభమైన మార్గం’ అని చిదంబరం సూచించారు. దిల్లీ సరిహద్దుల్లో 20 రోజులుగా, ఎముకలు కొరికే చలిలో రైతులు నిరసనలు చేస్తున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేసేందుకు ఏమాత్రం ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి పార్లమెంటులో కొత్త బిల్లు తీసుకురావాలంటే రైతులతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలి అని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈవిషయంలో జోక్యం చేసుకుని, చట్టాలని వెనక్కి తీసుకునేలా చేయాలని కోరాయి. మరోవైపు 20 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టాల్ని సమర్థిస్తోంది. రైతుల ప్రయోజనాల కోసమే వాటిని తీసుకువచ్చినట్లు చెబుతోంది. తాజాగా గుజరాత్‌లోని కచ్‌లో మంగళవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలు, రైతు సంఘాలు కోరిన అంశాలనే చట్టాలుగా తీసుకువచ్చామని.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 

ఇదీ చదవండి

రైతుల్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి: మోదీ
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు