కొవిడ్‌తో రక్తం గడ్డకట్టే ప్రమాదం

కొవిడ్‌ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని... రక్తనాళాల రుగ్మత గానూ పరిగణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published : 08 May 2021 07:57 IST

తాజా ఆధారాలతో నిపుణుల విశ్లేషణ

దిల్లీ: కొవిడ్‌ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని... రక్తనాళాల రుగ్మత గానూ పరిగణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రక్తం గడ్డకడుతోందని, అవయవాలను కాపాడేందుకు ఒక్కోసారి గడ్డలను తొలగించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం- ఆసుపత్రుల్లో చేరుతున్న కొవిడ్‌ బాధితుల్లో 14-28% మంది డీప్‌ వీన్‌ థ్రోంబోసిస్‌ (డీవీటీ)కు గురవుతున్నారు. వీరికి కాళ్లలోని నాళాల్లో రక్తం గడ్డకడుతోంది. ఇక 2-5% మందికి హృద్ధమనుల్లో రక్తం గడ్డల్లా పేరుకుపోతోంది. ధమనులు గుండె నుంచి అధిక ఆక్సిజన్‌తో రక్తాన్ని శరీరానికి తీసుకెళ్తే... సిరలు అక్కడి నుంచి తక్కువ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండెకు తిరిగి చేరుస్తాయి. రక్తం గడ్డకట్టడం వల్ల ప్రసరణలో ఇబ్బందులు తలెత్తి... 2-5% మంది కొవిడ్‌ బాధితుల్లో గుండెపోటు, పక్షవాతం, అవయవ నష్టం సంభవిస్తోంది. ‘‘మా ఆసుపత్రిలో వారానికి కనీసం 5-6 కేసుల్లో రక్తం తీవ్రస్థాయిలో గడ్డకట్టే పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిరోజులుగా ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోంది’’ అని దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి సర్జన్‌ డా.అంబరిష్‌ సాత్విక్‌ చెప్పారు. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్‌ బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు దిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌కేర్‌ హృద్రోగ నిపుణుడు అమరీశ్‌ కుమార్‌ చెప్పారు. ‘‘రక్తం గడ్డకట్టే పరిస్థితికి కొవిడ్‌ దారితీస్తోంది. ఓ కోవిడ్‌ బాధితుడి ధమనుల నుంచి ఇలాంటి గడ్డలను విజయవంతంగా తొలగించాం కూడా. ఏడాదిగా తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితులను చూస్తున్నాం. ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకూ అంతే హాని జరుగుతోంది’’ అని సాత్విక్‌ చెప్పారు. కొవిడ్‌కూ, రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు ప్రముఖ వైద్య జర్నల్‌ ‘ద లాన్సెట్‌’ ఇప్పటికే పలు అధ్యయనాలను విశ్లేషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని