రోబోలతో కరోనాకు చెక్‌!

ప్రపంచ దేశాలను కబలిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా. సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు కొవిడ్‌ కాటికి గురైనవారే. మహమ్మారి నుంచి బాధితులను కాపాడే క్రమంలో వందలాదిమంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు...

Updated : 19 Nov 2020 10:48 IST

బెంగళూరు ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా వినియోగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలను కబలిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా. సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు కొవిడ్‌కు గురైనవారే. మహమ్మారి నుంచి బాధితులను కాపాడే క్రమంలో వందలాదిమంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇన్వెంటో రోబోటిక్స్‌ సంస్థ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. బాధితులకు సాయపడేందుకు సరికొత్త రోబోలను రూపొందించింది. ఆ సంస్థ తయారుచేసిన రోబోలు బెంగళూరులోని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో 15 రోబోలు ప్రయోగాత్మకంగా సేవలందిస్తున్నాయి.

చికిత్స కోసం వచ్చే రోగుల వివరాలను నేరుగా రోబోనే నమోదు చేసేలా వాటిని రూపొందించారు. ఆసుపత్రికి వచ్చే వ్యక్తుల ఉష్ణోగ్రతలను ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా రోబోనే రికార్డు చేస్తుంది. అలాగే బాధితుడి అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులను అడిగి తెలుసుకుంటుంది. బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైద్యుడితో వర్చువల్‌గా మాట్లాడే అవకాశాన్ని రోబోనే కల్పిస్తుంది. ఇలా నర్సులు, ఆసుపత్రి సిబ్బందితో పనిలేకుండా రోబోనే అన్ని సేవలు అందించడం వల్ల వైరస్ వ్యాప్తిచెందే ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని ఇన్వెంటో సంస్థ చెబుతోంది. రోగుల ఆరోగ్య స్థితిని నమోదు చేయడంతోపాటు వారి హావభావాలను మిత్ర రోబోలు గుర్తిస్తున్నాయి. దాని ద్వారా వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనా వేస్తాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో రోబోల సేవలు కీలకమని ఇన్వెంటో సంస్థ అభిప్రాయపడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని