అమెరికా.. ఓ చెయ్యేసి సాయం పట్టనా..!

రష్యా.. అమెరికా మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.. ఇటీవల కొవిడ్‌-19పై తొలిటీకాను విడుదల చేసిన రష్యా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. టీకాను తయారు చేసే ఆపరేషన్‌ రాప్‌ స్పీడ్‌కు తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

Published : 14 Aug 2020 14:45 IST

 రష్యా ఆఫర్‌.. వద్దన్న అగ్రరాజ్యం 

ఇంటర్నెట్‌డెస్క్‌

రష్యా.. అమెరికా మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.. ఇటీవల కొవిడ్‌-19పై తొలిటీకాను విడుదల చేసిన రష్యా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. టీకాను తయారు చేసే ఆపరేషన్‌ ‘రాప్‌ స్పీడ్‌’కు తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని రష్యాలోని అధికారులు ఆంగ్లవార్త ఛానల్‌ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. కానీ, ఈ ఆఫర్‌ను అమెరికా తిరస్కరించిందని పేర్కొన్నారు. కొవిడ్‌పై టీకాను, చికిత్సను ఆవిష్కరించేందుకు పలు ఏజెన్సీలను సమన్వయం చేస్తూ ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

‘‘ రష్యాపై ఉన్న అపనమ్మకం వల్ల వారు మా టీకా, టెక్నాలజీ, పరీక్షా విధానాన్ని వాడుకోరు’’ అని ఓ రష్యా అధికారి పేర్కొన్నారు.  దీనిపై శ్వేతసౌధం ప్రెస్‌  కార్యదర్శి మెక్నాని మాట్లాడుతూ.. గురువారం తమకు టీకాపై అధ్యక్షుడు ట్రంప్‌ సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. అమెరికా తయారు చేస్తున్న టీకా ఫేజ్‌-3లో కఠిన పరీక్షలను ఎదుర్కొని మంచి ప్రమాణాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధి ఒక సవాలే..

కరోనావైరస్‌ను అడ్డుకునే టీకాను తయారు చేశామని రష్యా ప్రకటించింది.  తొలిదశ ప్రయోగాలు 45 మందిపై చేసినట్లు పేర్కొంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నోరు మెదపలేదు. అయితే టీకా తక్కువ మందిపై ప్రయోగించడం.. హడావుడిగా విడుదల చేయడం వంటివి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి టీకా తయారీకి 15ఏళ్లు అయినా పడుతుంది. వీటిల్లో వివిధ దశలను దాటాల్సి ఉంటుంది. కనీసం 12 నుంచి 18 నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గతంలో బ్రిటన్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ జేమ్స్‌ బ్రోకెన్‌షైర్‌ సంచలన ప్రకటన చేశారు. టీకా పరిశోధనలు చేస్తున్న సంస్థలపై రష్యా ప్రభుత్వ సహకారంతో ‘కోజీ బేర్‌’ (ఏపీటీ 29) అనే గ్రూప్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతోందనడాన్ని  95 శాతం కచ్చితత్వంతో చెప్పగలనని.. ఈ గ్రూప్‌ క్రెమ్లిన్‌ వేగుల బృందంలో కీలకమైన విభాగమని పేర్కొన్నారు. ఎంత డేటాను రష్యా చోరీ చేసిందనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. రష్యా గతంలో కూడా బ్రిటన్‌లో గూఢచర్యం చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంది.  దీనికి అమెరికా, కెనడాలు మద్దతు తెలిపాయి. మరోపక్క యూకే ఆరోపణలను రష్యా తిరస్కరించింది. పొంతన లేని ఆరోపణలని కొట్టిపారేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని