కొవిడ్‌ వ్యాక్సిన్‌కు అక్కడ మిశ్రమ స్పందనే..!

రష్యాలో వ్యాక్సిన్‌ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ పంపిణీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 17 Dec 2020 16:17 IST

మాస్కో: కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించగానే యావత్‌ ప్రపంచం ఆ దేశాన్ని ప్రశంసించింది. కానీ వ్యాక్సిన్‌ను తీసుకోవడంలో ప్రజల నుంచి అరకొర స్పందనే వస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ పంపిణీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 

అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే దానిని అతిపెద్ద విజయంగా ప్రకటించుకున్న రష్యాలో.. ఈ టీకాపై అక్కడి ప్రజల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్న దశలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అంతర్జాతీయంగా విమర్శలు..
కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం చేసిన అధికారిక ప్రకటనపై కేవలం రష్యాలోనే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలు ఎదుర్కొంది. వ్యాక్సిన్‌ను వేల మందిపై చేసే తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే ప్రజలకు అందుబాటులోకి తేవడంలో స్థానిక, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. వీటిని లెక్కచేయని క్రెమ్లిన్‌, వ్యాక్సిన్‌ను వేల మందికి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అనుమతులు వచ్చిన కొన్ని వారాల్లోనే కరోనా యోధులు, ఆరోగ్య సిబ్బంది వంటి వైరస్‌ ముప్పు ఉన్నవారికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం గత వారంలోనే దాదాపు లక్షా 50వేల మంది రష్యన్లు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు టీకా తయారు చేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ..
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను తప్పని పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చిందని కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న అక్కడి స్థానిక వైద్యులు అంటున్నారు. వైరస్‌ బారిన పడటం కంటే వ్యాక్సిన్‌ తీసుకోవడమే ప్రస్తుతం మా ముందున్న అవకాశమని మాస్కో సమీపంలోని కొవిడ్‌ ఆసుపత్రి వైద్యుడు డా.జాట్‌సెపిన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ వ్యాక్సిన్‌ సమర్థతపై పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. అందుకే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌పై కచ్చితమైన నమ్మకం మాత్రం కలుగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రిటన్‌ అనుమతితో మరింత దూకుడుగా..
కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు డిసెంబర్‌ 2 బ్రిటన్‌ ప్రకటించింది. ఆ వెంటనే అప్రమత్తమైన రష్యా అధ్యక్షుడు పుతిన్, వ్యాక్సిన్‌ పంపిణీ భారీ స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న కొన్నిరోజుల్లోనే దాదాపు 20లక్షల డోసులను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, విద్యా సంస్థలు, మునిసిపల్‌ సిబ్బంది అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. యూకేలో ముందుగా వృద్ధులకే ప్రాధాన్యం ఇస్తుండగా..రష్యాలో మాత్రం 18నుంచి 60ఏళ్ల వారికే వ్యాక్సిన్‌ తొలుత పంపిణీ చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మహమ్మారి పోరులో ముందున్నామని చెప్పుకునేందుకే రష్యా ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు మొదలయ్యాయి.

59శాతం వ్యాక్సిన్‌పై అనాసక్తి..
కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేసినప్పటికీ తీసుకునేందుకు మెజారిటీ రష్యన్లు సిద్ధంగా లేరని తాజా సర్వేలో వెల్లడైంది. రష్యాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ లెవాడా సెంటర్‌ అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో, దాదాపు 59శాతం ప్రజలు వ్యాక్సిన్‌పై అనాసక్తి కనబరిచినట్లు ప్రకటించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాకపోవడాన్నే ప్రధాన కారణంగా చూపుతున్నారని, అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌ రష్యా తయారు చేసినదే మొట్టమొదటిది అని ప్రకటించుకోవడంపైనా రష్యన్లు అనుమానం వ్యక్తంచేస్తున్నట్లు లెవాడా సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ డెనికస్‌ వోల్కోవ్‌ స్పష్టంచేశారు. రష్యాలోని వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులూ వ్యాక్సిన్‌పై సందేహం వ్యక్తం చేస్తున్నారని ఓ అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ కూడా వెల్లడించింది. ప్రస్తుతం రష్యాలో వ్యాక్సిన్‌ ప్రక్రియ మందకొడిగానే కొనసాగుతుందని తెలిపింది.

ఇదిలాఉంటే, రష్యాలో ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నప్పటికీ సదరు తయారీ సంస్థ ఇప్పటివరకు లైసెన్సు కోసం నియంత్రణ సంస్థల వద్ద దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి..
భారత్‌ చేతికి రష్యా వ్యాక్సిన్‌ డేటా..!
రష్యా టీకా: తాజా ఫలితాల్లోనూ 91శాతం సమర్థత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని