‘మాల్యాను రప్పించే ప్రక్రియలో పురోగతి ఏంటి’

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కేసులో సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఆయనను భారత్‌కు రప్పించే ప్రక్రియలో పురోగతికి సంబంధించి ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని కోరింది.

Published : 02 Nov 2020 17:54 IST

దిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కేసులో సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఆయనను భారత్‌కు రప్పించే ప్రక్రియలో పురోగతికి సంబంధించి ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. ఈమేరకు ధర్మాసనం మాల్యాపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ‘మాల్యాను భారత్‌కు రప్పించే ప్రక్రియలో పురోగతిపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలి’అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ధర్మాసనం సూచనలు చేసింది. ‘ఈ విషయంలో లండన్‌ హైకమిషన్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు’అని మెహతా వెల్లడించారు. అనంతరం ఈ కేసు విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం నిర్ణయించింది. 

అదేవిధంగా మాల్యాను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది ఈసీ అగర్వాల్‌ వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కాగా మాల్యాను రప్పించే విషయమై అక్టోబర్‌ 5న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో కేంద్రం స్పందిస్తూ.. యూకేలో జరుగుతున్న న్యాయవిచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయనను భారత్‌కు తీసుకురావడం కష్టమని పేర్కొన్న విషయం తెలిసిందే. 

భారతీయ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ ఆయనపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. 2019 జనవరిలో ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటిచింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని