ఇంటరాగేషన్‌ గదుల్లో సీసీటీవీలు పెట్టాల్సిందే..!

దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్‌ గదులు, లాకప్‌లు, కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ.......

Updated : 02 Dec 2020 21:46 IST

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్‌ చేపట్టే గదులు, లాకప్‌లు, కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ప్రధాన ద్వారం, కారిడార్లు, లాబీల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు వీలుగా పోలీస్‌స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఉంచాలని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, ఎన్సీబీ, డీఆర్‌ఐ సహా పలు దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాల్లోనే నిందితులను విచారిస్తుంటాయని, అందువల్ల సీసీటీవీలు, రికార్డింగ్ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. రాత్రిపూట స్పష్టంగా ఆడియో, వీడియో రికార్డు చేయగలిగే సామర్థ్యంతో కూడిన కెమెరాలను అమర్చాలని సూచించింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం డేటాను నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉన్న పరికరాలను కొనుగోలు చేయాలంది. 2018లో పంజాబ్‌లో జరిగిన కస్టోడియల్‌ హింస కేసు విచారణ నేపథ్యంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇప్పటికీ అమలు జరగడంలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. తాజా ఆదేశాలకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆరు వారాల్లోగా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని