కేరళ జర్నలిస్టు బెయిల్‌ విచారణ వాయిదా!

ఇటీవల హాథ్రస్‌ వెళ్లేందుకు యత్నించి అరెస్టైన కేరళ జర్నలిస్టు వ్యవహారంపై నాలుగు వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టైన విలేకరిని విడుదల చేయాలంటూ కేరళ జర్నలిస్ట్‌ యూనియన్‌(కేయూడబ్ల్యూజే) వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.

Published : 12 Oct 2020 19:37 IST

దిల్లీ: ఇటీవల హాథ్రస్‌ వెళ్లేందుకు యత్నించి అరెస్టైన కేరళ జర్నలిస్టు వ్యవహారంపై నాలుగు వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టైన విలేకరిని విడుదల చేయాలంటూ కేరళ జర్నలిస్ట్‌ యూనియన్‌(కేయూడబ్ల్యూజే) వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కేవలం సంబంధిత కుటుంబసభ్యులు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుందని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. కాబట్టి పిటిషనర్లు తమ పిటిషన్‌ను సవరించాలని.. సత్వర ఉపశమనం కోసం ముందు అలహాబాద్‌ హైకోర్టును సంప్రదించాలని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వారిని కోరింది. 

పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. ‘తన క్లయింట్‌పై నమోదైన కేసులో పోలీసులు శాంతి భద్రతల చట్టం కింద నేరారోపణలు జతచేశారు. ఈ విషయంలో రాష్ట్ర పరిధిలోని కోర్టు కూడా అతనికి బెయిల్‌ ఇవ్వలేదు. కేసు సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ఇప్పుడు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాం. దాన్ని సవరించి ఆర్టికల్‌ 32 కింద మరో పిటిషన్‌ దాఖలు చేస్తాం. సవరణకు కొంత సమయం కావాలి’ అని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. 

హాథ్రస్‌ హత్యాచార బాధిత కుటుంబసభ్యుల్ని కలిసేందుకు ఇటీవల ఓ కేరళ జర్నలిస్టుతో పాటు మరో ముగ్గురు వెళ్లగా వారిని యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారికి  పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తో సంబంధాలు ఉన్నట్లు పేర్కొంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్ట నిరసనల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేంచే కుట్రకు సంబంధించి పీఎఫ్‌ఐ నిధులను సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థపై యూపీలో ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని