మే నెల నాటికే 64 లక్షల మందికి కరోనా!

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అధికారికంగా 45 లక్షల 62 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే, ఐసీఎంఆర్‌ మాత్రం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మే నెల నాటికే దేశంలో దాదాపు 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది.........

Updated : 11 Sep 2020 14:35 IST

ఐసీఎంఆర్‌ సీరో సర్వేలో వెల్లడి

దిల్లీ: ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అధికారికంగా 45 లక్షల 62 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే, ఐసీఎంఆర్‌ మాత్రం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మే నెల నాటికే దేశంలో దాదాపు 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది, ఈ మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్‌ ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చిలో ప్రచురించింది. దేశంలో 0.73 శాతం మంది మధ్య వయస్కులు మే నెల నాటికే కొవిడ్‌ బారిన పడ్డారని సర్వేలో తేలింది. వీరిలో 43.3 శాతం మంది 18-45 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారే. 46-60 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 39.5 శాతం మంది, 60 ఏళ్ల పైబడిన వారిలో 17.2 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు గుర్తించినట్లు సర్వే తెలిపింది. ఈ మేరకు 21 రాష్ట్రాల్లోని 28 వేల మంది రక్త నమూనాలను పరీక్షించారు. 

మే నెల నాటికి జ‌నాభాలో కేవ‌లం ఒక శాతం మంది మ‌ధ్య వ‌య‌స్కుల‌కు మాత్రమే కొవిడ్‌-19 సంక్రమించి ఉంటుందని సీరో స‌ర్వే తేల్చింది. అంటే అప్పటికీ ఇంకా మహమ్మారి వ్యాప్తి తొలి దశలోనే ఉందని అభిప్రాయపడింది. అప్పటికి ఇంకా చాలా మందికి వైరస్‌ సోకే ముప్పు ఉందని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఉండే పురుషులు, మహమ్మారి సోకే ముప్పు ఎక్కువగా ఉండే పనిప్రదేశాల్లో ఉన్న వారిలోనే పాజిటివిటీ ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ప్రతి ఒక్కరి ద్వారా మరో 82-130 మందికి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 

సీరో సర్వే ద్వారా రక్తంలో యాంటీబాడీలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా ఎంత మంది వైరస్‌ ముప్పునకు గురయ్యారో గుర్తించొచ్చు. కొవిడ్‌ సోకినా చాలా మందిలో లక్షణాలు బయటపడడం లేదు. అలాంటి వారినీ ఈ సర్వే ద్వారా గుర్తించవచ్చు. అలా ఎంత మంది వైరస్‌ బారిన పడ్డారో సర్వే ద్వారా అంచనా వేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని