ఆయన ఆత్మహత్యపై ప్రశ్నించరేం: శివసేన

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య వెనక కారణాలేంటో తెలుసుకోవాలని ప్రయత్నించకపోవడం విడ్డూరంగా ఉందని...

Published : 09 Oct 2020 22:45 IST

ముంబయి: సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య వెనక కారణాలేంటో తెలుసుకోవాలని ప్రయత్నించకపోవడం విడ్డూరంగా ఉందని శివసేన మండిపడింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది. ‘‘ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. సీబీఐ మాజీ డైరెక్టర్‌, అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీగా పని చేశారు. మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా సేవలందించారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ)లో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి వ్యక్తి గత బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడితే ఎవరూ ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. 

అశ్వనీకుమార్‌ మరణంపై మీడియా కూడా స్పందించాల్సిన అవసరముందని చెప్పింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై మీడియాకు ఉన్న ఆసక్తి కుమార్‌ విషయంలో ఎందుకు లేదని శివసేన ప్రశ్నించింది. ‘సుశాంత్‌ రీల్‌ హీరో..కానీ, అశ్వనీ కుమర్‌ రియల్‌ హీరో’ అని కొనియాడింది.  సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరూ నమ్మడం లేదని, చాలా మంది దానిని ఎవరో చేసిన హత్యగానే  భావిస్తున్నారని చెప్పింది. కానీ, ఆత్మహత్యగా నిర్ధారణ అయిన కుమార్‌ మరణం వెనక ఏం జరిగిందో తెలుసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని శివసేన వ్యాఖ్యానించింది. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు  అశ్వనీకుమార్‌ రాసిన సూసైడ్‌ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీ సంజయ్‌ కుందు తెలిపారు. ఆయన గదిలోకి వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారని, కుమార్‌ లోపలికి వెళ్లి తలుపు బిగించి నైలాన్‌ తాడుతో ఉరి వేసుకున్నారని డీజీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని