నా విడుదల తేదీ బయటకి చెప్పొద్దు: శశికళ

జైలు నుంచి తాను ఎప్పుడు విడుదలవుతున్నారనే వివరాలను బయటకు వెల్లడించొద్దని తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన..........

Updated : 24 Sep 2020 19:26 IST

బెంగళూరు: జైలు నుంచి తాను ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని జయలలిత నెచ్చెలి వీకే శశికళ అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు లేఖ రాశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, జైలు నుంచి ఆమె విడుదలకు సంబంధించి ఊహాగానాలు వస్తున్న వేళ అధికారులకు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం కింద కూడా తన జైలు శిక్ష, విడుదల తదితర అంశాలను వెల్లడించొద్దని కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. తన వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని శశికళ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు పబ్లిసిటీ కోసమో, రాజకీయ దుష్ప్రచారం కోసమో ఇలాంటి దరఖాస్తులు చేస్తారని తెలిపారు.

బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన జైలు అధికారులు శశికళ వచ్చే ఏడాది జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందంటూ సమాచారం ఇచ్చారు. న్యాయస్థానం విధించిన రూ.10 కోట్ల జరిమానా కడితే జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని.. లేకపోతే మాత్రం 2022 ఫిబ్రవరి 27 వరకు జైలులోనే ఉండక తప్పదని తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా శశికళ తరఫున ఆమె న్యాయవాది జైలు చీఫ్‌ సూపరింటిండెంట్‌కు లేఖ రాశారు. మరోవైపు, సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని జైలు అధికారులు శశికళను ముందే విడుదల చేసే అవకాశం ఉందంటూ ఆమె న్యాయవాది తెలిపారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ విడుదలతో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. 2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా తేలుస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని