టీకా తీసుకున్న సౌదీ యువరాజు

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ శుక్రవారం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు టీకా తీసుకున్న ప్రముఖ వ్యక్తుల సరసన యువరాజు చేరారు. దేశ ప్రజల్లో భరోసా నింపేందుకు యువరాజు తీసుకున్న చొరవను......

Updated : 26 Dec 2020 12:39 IST

రియాద్‌: సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ శుక్రవారం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు టీకా తీసుకున్న ప్రముఖ వ్యక్తుల సరసన యువరాజు చేరారు. దేశ ప్రజల్లో భరోసా నింపేందుకు యువరాజు తీసుకున్న చొరవను ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ తాఫిఖ్‌ అల్‌-రబియా అభినందించారు. ప్రజలకు త్వరగా టీకా అందించేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారని వెల్లడించారు. సౌదీ రూపొందించిన 2030 దార్శనిక పత్రంలో వ్యాధుల నివారణకు పెద్దపీట వేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందులో భాగంగానే కొవిడ్‌ కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టామని తెలిపారు.

కొవిడ్‌ నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన టీకా డోసులు ఈ నెల ఆరంభంలో అమెరికా నుంచి సౌదీ అరేబియాకు చేరాయి. దీంతో ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3,61,903 కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,168 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ 3,52,815 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

టీకా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. వాటిని పారదోలేందుకు ఆయా దేశాధినేతలు ముందుకు వస్తున్నారు. టీకా వేయించుకొని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ టీకా తీసుకున్న ప్రముఖుల్లో ఉన్నారు.

ఇవీ చదవండి..

భారత్‌లో పెట్టుబడులకు సౌదీ ప్రణాళికలు

మోడెర్నా టీకా: యూఎస్‌ వైద్యుడికి తీవ్ర అలర్జీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని