పాఠశాలల మూతతో రూ.30లక్షల కోట్ల నష్టం!

పాఠశాలలను సుదీర్ఘకాలం మూసివుంచితే అభ్యసన నష్టాలతోపాటు దేశ భవిష్యత్‌ ఆదాయంలో దాదాపు రూ.30లక్షలకోట్ల (400బిలియన్‌ డాలర్లు) నష్టపోయే అవకాశముందని ప్రపంచ బ్యాంకు నివేదించింది.

Published : 12 Oct 2020 20:50 IST

నివేదించిన ప్రపంచ బ్యాంక్‌

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో గడచిన 7 నెలలుగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడే ఉన్నాయి. అన్‌లాక్ 5.0‌ ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలు తెరచుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతిఇచ్చింది. అయినప్పటికీ పాఠశాలలను పూర్తిస్థాయిలో తెరిచే పరిస్థితులు కనిపించడంలేదు. ఈ సమయంలో పాఠశాలలను సుదీర్ఘకాలం మూసివుంచితే అభ్యసన నష్టాలతోపాటు దేశ భవిష్యత్‌ ఆదాయంలో దాదాపు రూ.30లక్షలకోట్ల (400బిలియన్‌ డాలర్లు) నష్టపోయే అవకాశముందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. కరోనా వైరస్‌ ప్రభావంతో పాఠశాలల మూత వల్ల దక్షిణాసియా దేశాల్లోని విద్యార్థుల్లో ఎదురయ్యే అభ్యసన నష్టాలు, తద్వారా భవిష్యత్తులో దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టాలను ‘బీటెన్‌ ఆర్‌ బ్రోకెన్‌?’ పేరుతో రూపొందించిన నివేదికలో వెల్లడించింది.

55లక్షల మంది చదువుకు దూరం..

పాఠశాలల మూసివేతల ప్రభావాన్ని తగ్గించడానికి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తూ.. ఆయా ప్రభుత్వాలు ముమ్మర కృషిచేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్‌ ద్వారా పిల్లల్లో ఏకాగ్రతను కలిగించడం కష్టంగా మారుతోందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 55లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల ఒకతరం విద్యార్థుల ఉత్పాదకతపై ఈ ప్రభావం ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, దక్షిణాసియాలో ఈ నష్టం విలువ దాదాపు 622బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఇది గరిష్ఠంగా 880 బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కేవలం ఒక్క భారత్‌లోనే ఇది 400బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణాసియా దేశాల జీడీపీ మరింత క్షీణించడంతోపాటు భారత్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉందని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. ‘దక్షిణాసియా దేశాల్లో తాత్కాలికంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 39కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగానే ఉన్నారు. ఇప్పటికే ఎదుర్కొంటున్న అభ్యసన సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాన్ని ఇది మరింత క్లిష్టంగా మారుస్తుంది’ అని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. ప్రస్తుతం పాఠశాలలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచబ్యాంక్‌ ఈ తాజా అంచనాలు రూపొందించింది.

అంచనా ఇలా..!

కరోనా వైరస్‌ విజృంభణతో దేశవ్యాప్తంగా మార్చి 16నుంచి విద్యాసంస్థలు మూతబడే ఉన్నవిషయం తెలిసిందే. దీంతో ఈ విద్యాసంవత్సరంలో ఐదు నెలలుగా పాఠశాలలకు విద్యార్థులు దూరం కావడంతో కొత్త విషయాలను నేర్చుకోవడంలో వెనకబడటం, మరికొందరు నేర్చుకున్నవాటిని మరచిపోవడం జరుగుతుందని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. ఈ సమయంలో అభ్యసన నష్టాలను అంచనా వేసేందుకు లెర్నింగ్‌-అడ్జెస్టెడ్‌ ఇయర్స్‌ ఇఫ్‌ స్కూలింగ్‌(LAYS)ను 0.5 సంవత్సరం నష్టాన్ని పరిగణలోకి తీసుకొంది. దీంతో ప్రస్తుతం 6.5గా ఉన్న LAYS 6.0సంవత్సరాలకు పడిపోతుందని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. ఇది గడచిన కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యపై సాధించిన పురోగతికి భారీ ఎదురుదెబ్బ అని ప్రపంచబ్యాంక్‌ స్పష్టంచేసింది. పాఠశాలలకు వెళ్లేవిద్యార్థులు, వారు అక్కడ నేర్చుకునే ఫలితాలను ఒకేసారి అంచనా వేసేందుకు LAYS కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిన ప్రపంచబ్యాంక్‌, వీటి ఆధారంగా ఫలితాలను అంచనా వేస్తోంది.

ప్రస్తుత ప్రభావం వల్ల, దక్షిణాసియాలో సగటు ఒక విద్యార్థి కార్మిక మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత తన జీవితకాలం ఆదాయంలో దాదాపు 4400 డాలర్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇది అతని మొత్తం ఆదాయంలో ఐదుశాతానికి సమానమని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాసియా దేశాలన్నీ కలిసి ప్రాథమిక, ఉన్నత విద్యకోసం ఏటా దాదాపు 400బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయని.. ప్రస్తుతం పాఠశాలల మూసివేత కొనసాగింపు వల్ల భవిష్యత్తులో జరిగే నష్టం, ప్రస్తుతం ఈ దేశాలు విద్యకోసం ఖర్చుపెడుతోన్న దానికంటే ఎక్కువగా ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ స్పష్టంచేసింది. ఇలాగే పాఠశాలలు మరింత కాలం మూసివుంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలతోపాటు భవిష్యత్‌ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని