రిఫ్రిజిరేటర్లు లేకుండానే వ్యాక్సిన్‌ స్టోరేజి!

రిఫ్రిజిరేటర్ల అవసరమే లేకుండా వ్యాక్సిన్‌లను భద్రపరిచే నూతన విధానాన్ని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తద్వారా నిల్వ, రవాణా సమయంలో వృథాను గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు.

Published : 13 Nov 2020 01:20 IST

కొన్ని వ్యాక్సిన్‌లకు ప్రయోజనం అంటున్న శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు తుది దశకు చేరుకున్న వేళ.. వాటిని భద్రపరచడం, అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద సరఫరాలో వచ్చే సవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫైజర్‌ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లను అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి రావడం ఓ సవాల్‌గా మారింది. ఇలాంటి సమయంలో, అసలు రిఫ్రిజిరేటర్ల అవసరమే లేకుండా వ్యాక్సిన్‌లను భద్రపరిచే నూతన విధానాన్ని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తద్వారా నిల్వ, రవాణా సమయంలో వృథాను గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు.

సాధారణంగా వ్యాక్సిన్‌లను ఒకచోట నుంచి మరోచోటుకు తరలించాలంటే కనీస ఉష్ణోగ్రతల (2 నుంచి 8 డిగ్రీల‌ సెల్సియస్‌) వద్ద వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. అయితే, ఇలా తగినంత ఉష్ణోగ్రత లేనికారణంగా దాదాపు సగం వ్యాక్సిన్‌లు వృథా అవుతున్నాయని అమెరికాలోని మిషిగాన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బయోమెటీరియల్స్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, రిఫ్రిజిరేటర్లపై ఆధారపడకుండా వ్యాక్సిన్‌లను దగ్గర దగ్గరగా ఉంచే నూతన విధానాన్ని అభివృద్ధిచేశారు. ఇందుకోసం పాజిటివ్‌, నెగెటివ్‌ చార్జీలు కలిగిన సింథటిక్‌ ప్రోటీన్లను ఉపయోగించారు. ఇవి ఏదైనా ద్రావణంలో ఉంచినప్పుడు రెండు విభన్న ద్రవ దశలను ఏర్పరుస్తాయని.. ఈ ప్రక్రియనే సంక్లిష్ట కోసర్వేషన్‌గా పరిగణిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ద్రవ దశలే వైరస్‌ బాహ్య ఉపరితలంపై చుట్టుగా పేరుకొని లోపలఉండే పదార్థాన్ని దగ్గరగా ఒక ముద్దలాగా చుట్టివేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇవి లిపిడ్‌ లేదా కొవ్వుపొర ఉండని పోలియో, సాధారణ జలుబు వంటి వైరస్‌లకు మాత్రమే పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే, కోసర్వేటివ్‌లలో ఉపయోగించే నిర్దిష్ట పదార్థాలపై దృష్టిసారించాలని.. వైరస్‌ను స్థిరీకరించడంలో భాగంగా కేవలం లోపలి పదార్థాన్ని గుంపుగా ఉంచడం మాత్రమే కచ్చితమైన వ్యూహం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సురక్షిత విధానం ఉన్న వ్యాక్సిన్‌లకు ఇది అదనం అని అమెరికన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts