
నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి..!
ప్రయాణికుల అరుపులు.. అంబులెన్స్‌ల సైరన్లు..!
విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు
కొలికోడ్: ఓ వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్లు, మరోవైపు రక్తంతో తడిసిన బట్టలు.. భయంతో వణికిన చిన్నారులు.. ఇవీ నిన్న రాత్రి కొలికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సమయంలో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు. దుబాయి నుంచి కొలికోడ్కు చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై జారిపడటంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది మరణించగా.. 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలను స్థానికులు వివరించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రెండుగా విరిగిపోయిన విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ క్షణం ఏం జరిగిందో తెలియని ఆందోళన. ఆ భయానక క్షణాల్లో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతో పాటు నాలుగైదేళ్ల చిన్నారులు, ప్రయాణికులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు సరైన సమయానికి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.
నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి..
విమాన ప్రమాదం సమయంలో అక్కడ ఉన్న పరిస్థితిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ.. ‘‘భయంకరమైన శబ్దం విని నేను అక్కడికి పరుగులు తీశాను. చిన్నారులు కొందరు సీట్ల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ ప్రాంతమంతా దుఖఃసంద్రంగా మారింది. మేం అక్కడికి వెళ్లేసరికే కొందరు కింద పడిపోయి ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు. కొందరి కాళ్లు విరిగాయి. నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి’’ అని వివరించాడు.
కాక్‌పిట్ విరగ్గొట్టి పైలట్‌ను బయటకు తీశారు..
గాయపడిన పైలట్‌ను కాక్‌పిట్ విరగ్గొట్టిన తర్వాత బయటకు తీశారని మరో వ్యక్తి వివరించాడు. అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొనేటప్పటికే కొందరు స్థానికులు కార్లు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను కొలికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారని తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.