ఫ్రాన్స్‌కు ‘రెండో దఫా’ వైరస్‌ ముప్పు..!

రానున్న కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ ‘రెండో దఫా’ ప్రమాదం పొంచివుందని అక్కడి శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరించింది.

Published : 05 Aug 2020 00:16 IST

హెచ్చరించిన ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తల బృందం

పారిస్: కొన్ని నెలల క్రితం కరోనా వైరస్‌ విజృంభణకు ఫ్రాన్స్‌ వణికిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, గత రెండువారాలుగా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రానున్న కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ ‘రెండో దఫా’ ప్రమాదం పొంచివుందని అక్కడి శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరించింది.

వైరస్‌ విజృంభణ కొనసాగుతోన్న సమయంలో ఐరోపా దేశాలు పూర్తి నియంత్రణ చర్యలు చేపట్టాయి. కఠినమైన లాక్‌డౌన్‌ చర్యల ఫలితంగా కొన్ని మాసాల్లోనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఆంక్షలు తొలగించడంతో ప్రజలు సమూహాలుగా సంచరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో ప్రజలు గుంపులుగా ఏర్పడడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

‘ప్రస్తుత పరిస్థితి ప్రమాదకరమైనదని.. వైరస్‌ను అదుపుచేయలేని పరిస్థితులు ఏక్షణంలోనైనా రావచ్చు’అని ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తల బృందం తాజాగా ప్రకటించింది. రానున్న శీతాకాలం(డిసెంబర్ నుంచి‌)లోనే రెండవ దఫా వైరస్‌ విజృంభణ మొదలయ్యే అవకాశం ఉందని ఈ బృందం అంచనా వేసింది. ఒకవేళ ప్రజలు భౌతిక దూరం పాటించకపోతే మాత్రం వేసవి కాలం(సెప్టెంబర్‌)లోనే వైరస్‌ మరోసారి  విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించింది.

జర్మనీలో భౌతికదూరం నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఇప్పటికే మరో దఫా విజృంభణ ప్రారంభమైనట్లు అక్కడి వైద్య నిపుణులు స్పష్టం చేశారు. దీంతో వైరస్‌ విజృంభణ కొన్నినెలల్లో సాధించిన పురోగతి పూర్తిగి వ్యర్ధమైనట్లేనని జర్మనీ అత్యున్నత వైద్యుల బృందం ఈమధ్యే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ కూడా రెండో దఫా విజృంభణపై ఈ ప్రకటన చేసింది. ఇదిలాఉంటే, ఫ్రాన్స్‌లో 2లక్షల 25వేల కొవిడ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 30,268 మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
ప్రపంచానికి రెండో ముప్పు..!
కరోనా ముప్పు ఎప్పటికీ తొలగిపోదేమో..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని