భద్రత పేరుతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారు

జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వేడి రాజుకుంది. గుప్‌కార్‌ కూటమి అభ్యర్థుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, గుప్‌కార్‌

Updated : 21 Nov 2020 21:31 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వేడి రాజుకుంది. గుప్‌కార్‌ కూటమి అభ్యర్థుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, గుప్‌కార్‌ డిక్లరేషన్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు భద్రతను సాకుగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ ఎన్నికల కమిషనర్‌ కేకే శర్మకు అబ్దుల్లా లేఖ రాశారు.

‘రాబోయే ఎన్నికల గురించి నేను మీకీ లేఖ రాస్తున్నాను. పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ తరఫున అభ్యర్థులను ప్రకటించిన వెంటనే వారిని భద్రత పేరుతో ఇతర ప్రదేశాలకు తరలించారు. అక్కడి నుంచి బయటకు రాకుండా చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతినివ్వడం లేదు. గుప్‌కార్‌ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు గతంలో అధికారంలో ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడిపించాయి. భద్రత విషయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి కూటమి పార్టీలకు తెలుసు. అవేమీ మాకు కొత్త కావు. ఒకవేళ నిజంగా భద్రత కల్పించాల్సిన అవసరం వస్తే.. పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ రక్షణ ఇవ్వాలి. కానీ ఇప్పుడు అధికారులు కేవలం కొంతమందిని భద్రత పేరుతో బంధించారు. భద్రత పేరుతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఫరూఖ్‌ అబ్దుల్లా ఆరోపించారు. 

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ తదితర పార్టీల అభ్యర్థులను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని, భద్రత పేరుతో వారిని వేరే ప్రాంతాలకు తరలించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫరూఖ్‌ అబ్దుల్లా ఈసీకి లేఖ రాశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని