వ్యాక్సిన్‌పై వార్తలు ఖండించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌

దేశీయంగా మరో 73 రోజుల్లో కొవి‌షీల్డ్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి  వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది....

Published : 24 Aug 2020 00:34 IST

పుణే: దేశీయంగా మరో 73 రోజుల్లో కొవి‌షీల్డ్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సీరమ్‌ సంస్థకు చెందిన కొవి‌షీల్డ్ వ్యాక్సిన్‌ మరో 73 రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితం. ప్రస్తుతం వ్యాక్సిన్‌ తయారుచేసి, భవిష్యత్తు అవసరాల కోసం దానిని నిల్వ చేయడానికి మాత్రమే ప్రభుత్వం మాకు అనుమతించింది. పరీక్షలు విజయవంతమై, అవసరమైన అనుమతులు లభించిన తర్వాత మాత్రమే కొవిషీల్డ్‌ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి, ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని నిరూపణ అయిన తర్వాతే దాని లభ్యతపై సీరమ్‌ సంస్థ అధికారికంగా ప్రకటన చేస్తుంది’’ అని ఎస్‌ఐఐ వివరణ ఇచ్చింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు ఎస్‌ఐఐ బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ సహా ప్రపంచంలోని 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు ఎస్‌ఐఐ గతంలో ప్రకటించింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి ఉత్పత్తి పెంచేందుకు ఎస్‌ఐఐ గేట్స్‌ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్‌ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ లభ్యతపై వస్తున్న వార్తలను ఎస్‌ఐఐ ఖండించింది. 2021 మధ్యకల్లా వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఎస్‌ఐఐ గతంలోనే తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని