Windows: కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి

విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కోరింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని

Updated : 09 Jul 2021 15:46 IST

విండోస్‌ వినియోగదారులను కోరిన మైక్రోసాఫ్ట్‌

వాషింగ్టన్‌: విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కోరింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది. దాన్ని నివారించేందుకు ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్‌ స్పూలర్‌’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్‌ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్‌లైన్‌లో ప్రచురించారు. వెంటనే డిలీట్‌ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్‌ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. ‘ప్రింట్‌నైట్‌మేర్‌’గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్‌లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసే ముప్పుందని; డేటాను చూడటం, డిలీట్‌ చేయడం, కొత్త యూజర్‌ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకూ పాల్పడే అవకాశముందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. ఫలితంగా కంప్యూటర్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ వస్తుందని పేర్కొంది. విండోస్‌-10తో పాటు విండోస్‌-7లోనూ ఈ లోపం ఉందని తెలిపింది. వాటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది. ఇంతకుముందు బయటపడ్డ లోపాలనూ అధిగమించేలా తాజా అప్‌డేట్‌లను సమగ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. వాస్తవానికి విండోస్‌-7కు తమ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ గత ఏడాదే ముగించింది. అయితే- ప్రింట్‌నైట్‌మేర్‌ తీవ్రత దృష్ట్యా మళ్లీ ఆ వర్షన్‌కు కూడా అప్‌డేట్‌ను అందించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని